బ్యాంకులో 'బీఫ్' రగడ.. మేనేజర్‌కు వ్యతిరేకంగా ఉద్యోగుల వినూత్న నిరసన!

  • కొచ్చి కెనరా బ్యాంకులో రాజుకున్న బీఫ్ వివాదం
  • క్యాంటీన్‌లో బీఫ్ వడ్డించొద్దన్న కొత్త రీజినల్ మేనేజర్
  • ఆదేశాలను వ్యతిరేకిస్తూ బీఫ్ వడ్డించి ఉద్యోగుల నిరసన
  • ఆహారం ఎంచుకోవడం వ్యక్తిగత హక్కు అంటున్న సిబ్బంది
  • ఉద్యోగుల ఆందోళనకు మద్దతు పలికిన స్థానిక ఎమ్మెల్యే
  • కేరళలో సంఘ్ పరివార్ ఎజెండాలు చెల్లవని వ్యాఖ్య
కేరళలోని కొచ్చిలో కెనరా బ్యాంక్ శాఖలో ఒక కొత్త వివాదం చోటుచేసుకుంది. బ్యాంకు క్యాంటీన్‌లో బీఫ్ వడ్డించడాన్ని వ్యతిరేకించిన మేనేజర్‌కు నిరసనగా ఉద్యోగులు అక్కడే అందరికీ బీఫ్ వడ్డించి తమ అసమ్మతిని వినూత్నంగా తెలియజేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల బీహార్‌కు చెందిన ఓ అధికారి కొచ్చిలోని కెనరా బ్యాంక్ రీజినల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బ్యాంకు ప్రాంగణంలో, క్యాంటీన్‌లో బీఫ్ వడ్డించరాదని సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి, సదరు మేనేజర్ అధికారులను మానసికంగా వేధిస్తున్నారని, అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) ముందుగా నిరసన చేపట్టాలని నిర్ణయించింది. అయితే, అదే సమయంలో బీఫ్ నిషేధం విషయం బయటకు రావడంతో ఉద్యోగులు తమ నిరసనను ఈ అంశంపైకి మళ్లించారు.

ఈ నిరసనపై ఫెడరేషన్ నాయకుడు ఎస్ఎస్ అనిల్ మాట్లాడుతూ "ఇక్కడ ఓ చిన్న క్యాంటీన్ ఉంది. కొన్ని ప్రత్యేక రోజుల్లో బీఫ్ వడ్డిస్తుంటారు. అయితే, ఇకపై బీఫ్ వడ్డించవద్దని మేనేజర్ క్యాంటీన్ సిబ్బందికి చెప్పారు. ఈ బ్యాంకు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తుంది. ఆహారం అనేది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక. ఎవరికి నచ్చిన ఆహారం వారు తినే హక్కు భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఉంది. మేం ఎవరినీ బలవంతంగా బీఫ్ తినమని చెప్పడం లేదు. ఇది కేవలం మా నిరసన రూపం మాత్రమే" అని స్పష్టం చేశారు.

ఈ నిరసనకు రాజకీయ మద్దతు కూడా లభించింది. వామపక్ష మద్దతున్న స్వతంత్ర ఎమ్మెల్యే కేటీ జలీల్ ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. కేరళలో ఎలాంటి సంఘ్ పరివార్ ఎజెండాలను అనుమతించబోమని ఆయన హెచ్చరించారు. "ఏం తినాలో, ఏం ధరించాలో పై అధికారులు నిర్ణయించకూడదు. ఈ నేల ఎర్రనిది. ఎర్రజెండా ఎగిరే చోట ఫాసిస్టులకు వ్యతిరేకంగా నిర్భయంగా మాట్లాడవచ్చు" అని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. గతంలో 2017లో పశువుల అమ్మకాలపై కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా కూడా కేరళలో ఇలాంటి బీఫ్ నిరసనలు జరిగిన విషయం తెలిసిందే.


More Telugu News