లేడీ డాన్ అరుణపై ప్రశ్నల వర్షం.. రౌడీషీటర్లతో సంబంధాలపై పోలీసుల ఆరా!

  • లేడీ డాన్ అరుణ రెండో రోజు విచారణ పూర్తి
  • రౌడీషీటర్లు, రాజకీయ నాయకులతో సంబంధాలపై ప్రశ్నల వర్షం
  • శ్రీకాంత్ పెరోల్ విషయంలో ఆసక్తి ఎందుకని ఆరా
  • కొన్నింటికి సమాధానం, మరికొన్నింటికి తెలియదన్న అరుణ
  • విచారణ ముగిశాక ఒంగోలు సబ్‌జైలుకు తరలింపు
ఏపీలో సంచలనం సృష్టించిన లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజైన శుక్రవారం (నిన్న) ఆమెను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నెల్లూరు జిల్లాలోని రౌడీషీటర్లతో ఆమెకు ఉన్న సంబంధాలు, రాజకీయ నాయకులతో పరిచయాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

కోవూరు పోలీస్ స్టేషన్‌లో నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ విచారణలో అరుణను సుమారు 40 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో ఆమె ఎందుకు అంత ఆసక్తి చూపించారు, అతన్ని బయటకు తీసుకురావడానికి ఎవరు సహకరించారనే కోణంలో లోతుగా ప్రశ్నించారు. అలాగే, ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ వివాదంలో యజమానిని బెదిరించిన ఘటన వెనుక ఎవరెవరు ఉన్నారని పోలీసులు ఆరా తీశారు.

పోలీసుల ప్రశ్నల్లో కొన్నింటికి అరుణ సమాధానమిచ్చినప్పటికీ, మరికొన్ని ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదని చెప్పినట్లు సమాచారం. అయితే, పెరోల్ విషయంలో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు తనకు సహకరించినట్లు ఆమె అంగీకరించినట్లు తెలిసింది. తనపై కొందరు కావాలనే కక్షగట్టారని, మీడియానే లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఆమె పోలీసులతో అన్నట్లు సమాచారం.

ఈ విచారణలో భాగంగా అరుణ కుటుంబ నేపథ్యం, ఆమె ఆర్థిక లావాదేవీలు, సెటిల్‌మెంట్లు, ఇంటి స్థలాల పేరుతో చేసిన మోసాలపై కూడా పోలీసులు వివరాలు సేకరించారు. విచారణ ముగిసిన అనంతరం ఆమెను తిరిగి నెల్లూరు జైలుకు తరలించారు. మూడో రోజు విచారణ ఈరోజుతో పూర్తి కానుంది. ఆ తర్వాత ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచి, ఒంగోలు సబ్‌జైలుకు తరలించనున్నారు. 


More Telugu News