: ఐఏఎస్ అధికారిణి చీరలు, విగ్గుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు: భూమనపై చింతా మోహన్ ఫైర్

  • రాజశేఖరరెడ్డి కోసం జైలుకు వెళ్లిన అధికారిణిని విమర్శిస్తారా? అని చింతా మోహన్ మండిపాటు
  • అక్రమాల కోసం ఆమెను వాడుకున్నారని ఆరోపణ
  • వ్యక్తిగతంగా దూషించడం సరికాదని హితవు
వైసీపీ నేతల తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిని (శ్రీలక్ష్మి) లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేత భూమన కరుణాకర రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల విగ్గులు, చీరల గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

ఈరోజు గుంటూరులో పర్యటించిన చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ... "దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పిన చోటల్లా సంతకాలు చేసి, ఆయన కోసం జైలుకు కూడా వెళ్లిన అధికారిణి ఆమె. తమ అక్రమాల కోసం ఆమెను వాడుకుని, ఇప్పుడు ఇలా వ్యక్తిగతంగా దూషించడం సరికాదు" అని హితవు పలికారు. వైసీపీ నేతలు వెంటనే ఆ అధికారిణికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతరం రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే వారికి గిట్టుబాటు ధర కల్పించి, రుణమాఫీ చేయాలని సూచించారు. సినీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇస్తున్న ప్రభుత్వం, అన్నం పెట్టే రైతులకు ఎందుకు అండగా నిలవడం లేదని ఆయన ప్రశ్నించారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కూడా చింతా మోహన్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలను నాశనం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం పనిచేస్తోందని విమర్శించారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిని సైతం శిక్షించేలా రాజ్యాంగ సవరణలు తీసుకువస్తున్నారని ఆరోపించారు. దేశంలోని బ్యాంకులు 90 శాతం రుణాలను కేవలం కార్పొరేట్ సంస్థలకే కట్టబెడుతున్నాయని, ఇటీవల మాఫీ చేసిన రూ.14 లక్షల కోట్ల రుణాలలో ఎవరి వాటా ఎంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

More Telugu News