: కేరళ మంత్రి బంధువుల హత్య.. ఇంట్లో కాలిన స్థితిలో మృతదేహాలు

  • కన్నూర్ జిల్లా అలవిల్ ప్రాంతంలో దారుణం
  • పిల్లలు విదేశాల్లో స్థిరపడడంతో ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులు
  • బుధవారం నుంచి బయటకు రాలేదంటున్న ఇరుగుపొరుగు
కేరళలోని కన్నూర్ జిల్లా అలవిల్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులను దుండగులు దారుణంగా హతమార్చారు. పదునైన వస్తువుతో కొట్టి చంపి ఆపై మృతదేహాలను కాల్చేశారు. మృతులను కేరళ అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ బంధువులుగా పోలీసులు గుర్తించారు.

 వివరాల్లోకి వెళితే.. మంత్రి ఏకే శశీంద్రన్ మేనకోడలు ఏకే శ్రీలేఖ (68), ఆమె భర్త ప్రేమరాజన్‌ (75) లు కన్నూర్ జిల్లాలోని అలవిల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇద్దరు పిల్లలు విదేశాల్లో స్థిరపడడంతో ఒంటరిగానే కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులను చూసేందుకు వస్తున్నట్లు ప్రేమరాజన్ కుమారుడు కబురు చేశాడు. ఆయనను ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకువచ్చేందుకు కారు కోసం గురువారం సాయంత్రం డ్రైవర్ ఇంటికి వచ్చాడు.

డోర్ కొట్టినా, ఎంత పిలిచినా స్పందించకపోవడంతో డ్రైవర్ పక్కింటి వారిని ఆశ్రయించాడు. బుధవారం తర్వాత ఆ దంపతులను తాము చూడలేదని వారు వెల్లడించారు. దీంతో ఇరుగుపొరుగు సాయంతో డోర్ బద్దలు కొట్టి లోపలకు వెళ్లిన డ్రైవర్ కు కాలిన స్థితిలో శ్రీలేఖ, ప్రేమరాజన్ ల మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి మృతదేహాలను పరిశీలించారు.

శ్రీలేఖ తలపై పదునైన వస్తువుతో కొట్టిన గాయాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రక్తంతో తడిసిన సుత్తిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, ఇంట్లోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు కనిపించలేదని అన్నారు. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

More Telugu News