Galla Madhavi: గంజాయి ముఠాను పోలీసులకు పట్టించిన ఎమ్మెల్యే గల్లా మాధవి

Galla Madhavi Exposes Ganja Gang to Police
  • గుంటూరు నగరంలోని రెడ్డి కళాశాల ప్రాంగణంలో సంఘటన
  • గంజాయి సేవిస్తూ మహిళలను వేధిస్తున్నట్లు ఎమ్మెల్యేకు ఫిర్యాదులు
  • స్వయంగా రంగంలోకి దిగి ఆకతాయిలను పట్టించిన ఎమ్మెల్యే
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గంజాయి ముఠాను పోలీసులకు పట్టించారు. గుంటూరు నగరంలోని రెడ్డి కళాశాల ప్రాంగణంలో కొందరు గంజాయి సేవిస్తూ మహిళలను, యువతులను వేధిస్తున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది.

బాధితులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఎమ్మెల్యే స్వయంగా కళాశాల వద్దకు చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి ముగ్గురు ఆకతాయిలను పట్టుకున్నారు. విద్యార్థులు, మహిళలను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

నగరంలో గంజాయి వ్యసనం పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని, గంజాయి అమ్మకందారులను గుర్తించి వారిని కట్టడి చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమగ్ర పర్యవేక్షణ చేయాలని పోలీసు విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.

"ప్రజల భద్రతకు, యువత భవిష్యత్తును నాశనం చేయబోయే గంజాయి మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. మహిళలు, యువతులు భయపడకుండా జీవించే వాతావరణాన్ని కల్పించడం నా ప్రథమ కర్తవ్యం" అని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు.
Galla Madhavi
Guntur
Guntur West MLA
Ganja mafia
Marijuana
Andhra Pradesh Police

More Telugu News