Textile Industry: టెక్స్‌టైల్ రంగానికి కేంద్రం ఊరట

Govt extends import duty exemption on cotton till Dec 31
  • పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపు పొడిగింపు
  • ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కొనసాగనున్న రద్దు
  • 11 శాతం దిగుమతి సుంకం నుంచి పరిశ్రమకు ఉపశమనం
  • తయారీదారులతో పాటు వినియోగదారులకూ ప్రయోజనం
  • జులైలో 5.3 శాతం మేర పెరిగిన టెక్స్‌టైల్ ఎగుమతులు
దేశీయ టెక్స్‌టైల్ పరిశ్రమకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి దిగుమతులపై ఉన్న 11 శాతం సుంకాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో టెక్స్‌టైల్ తయారీదారులతో పాటు వినియోగదారులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.

భారతీయ టెక్స్‌టైల్ పరిశ్రమకు పత్తి లభ్యతను పెంచడం, ముడిసరుకు ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవానికి సెప్టెంబర్ 30తో ముగియనున్న ఈ మినహాయింపును, ఎగుమతిదారులకు మరింత మద్దతు ఇచ్చేందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) త్వరలోనే జారీ చేయనుంది.

ఈ మినహాయింపులో 5 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ), 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ (ఏఐడీసీ)తో పాటు వాటిపై విధించే 10 శాతం సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్‌ కూడా ఉన్నాయి. దీంతో మొత్తం 11 శాతం సుంకం భారం పరిశ్రమపై తగ్గనుంది. ఈ నిర్ణయం వల్ల నూలు, వస్త్రాలు, దుస్తుల తయారీ వంటి అన్ని విభాగాల్లో ఉత్పత్తి ఖర్చులు తగ్గి పరిశ్రమకు ఉపశమనం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత టెక్స్‌టైల్ రంగం స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్‌ స్టాటిస్టిక్స్ (డీజీసీఐఎస్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జులైలో టెక్స్‌టైల్ ఎగుమతులు 3.1 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 2.94 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 5.3 శాతం అధికం. అలాగే ఏప్రిల్-జులై మధ్య కాలంలో మొత్తం ఎగుమతులు 12.18 బిలియన్ డాలర్లుగా నమోదై, 3.87 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
Textile Industry
Cotton Imports
Import Duty
CBIC
Textile Exports
Textile Sector
Indian Economy
Economic Relief

More Telugu News