అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో కేంద్రానికి రఘురామ్ రాజన్ కీలక సూచన

  • భారత ఎగుమతులపై అమెరికా 50 శాతం టారిఫ్
  • వాణిజ్యం, పెట్టుబడులు ఆయుధాలుగా మారాయన్న రఘురామ్ రాజన్
  • చైనా, యూరప్‌పై లేని వివక్ష మనపైనే ఎందుకని ప్రశ్న
  • రొయ్యలు, టెక్స్‌టైల్ ఎగుమతిదారులకు తీవ్ర నష్టమని వ్యాఖ్య
  • ఒకే దేశంపై ఆధారపడొద్దని కేంద్రానికి కీలక సూచన
భారత ఎగుమతులపై అమెరికా విధించిన భారీ సుంకాలు దేశానికి ఒక మేల్కొలుపు వంటివని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ రఘురామ్ రాజన్ అన్నారు. నేటి ప్రపంచంలో వాణిజ్యం, పెట్టుబడులు వంటివి ఆయుధాలుగా మారిపోయాయని, ఈ పరిస్థితుల్లో భారత్ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆయన హెచ్చరించారు. ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చిన 50 శాతం టారిఫ్‌లు భారత ఎగుమతిదారులపై తీవ్రమైన భారం మోపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా, యూరప్ దేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోని అమెరికా, కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడంపై రాజన్ ప్రశ్నలు లేవనెత్తారు. "రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను కొనసాగించడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది మనం ఆలోచించుకోవాలి. రిఫైనరీలు లాభాలు గడిస్తున్నా, ఎగుమతిదారులు మాత్రం ఈ టారిఫ్‌లతో తీవ్రంగా దెబ్బతింటున్నారు. ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటే, ఈ కొనుగోళ్లపై పునరాలోచించాలి" అని ఆయన సూచించారు.

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ఏ ఒక్క దేశంపైనా అతిగా ఆధారపడటం ప్రమాదకరమని రాజన్ హితవు పలికారు. అమెరికా, చైనా, జపాన్ లేదా యూరప్‌.. ఇలా అన్ని దేశాలతోనూ సమానంగా వాణిజ్య సంబంధాలు నెరపడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్ యుద్ధానికి ఆజ్యం పోస్తోందంటూ వైట్‌హౌస్ సలహాదారు పీటర్ నవర్రో చేసిన ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు.

ఈ టారిఫ్‌ల వల్ల దేశంలోని చిన్న ఎగుమతిదారుల జీవితాలు అతలాకుతలమవుతాయని రాజన్ హెచ్చరించారు. ముఖ్యంగా రొయ్యల రైతులు, టెక్స్‌టైల్ పరిశ్రమపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. దీనివల్ల కేవలం మన ఎగుమతిదారులే కాకుండా, 50 శాతం అధిక ధరలు చెల్లించాల్సి రావడంతో అమెరికన్ వినియోగదారులు కూడా నష్టపోతారని విశ్లేషించారు. వాణిజ్య లోటును దోపిడీగా భావించడం, విదేశీ విధానంలో కక్ష సాధింపులకు పాల్పడటం వంటి కారణాలతోనే అమెరికా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, దేశ ప్రజల ప్రయోజనాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. తమ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ, ఇతర దేశాల విషయంలో ఉదాసీనంగా ఉండటాన్ని వివక్షగా పేర్కొంది. 


More Telugu News