Narsapur Express: నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. సిగ్నల్ ట్యాంపర్ చేసి దోపిడీ!

Narsapur Express Robbery Train Halted by Signal Tampering
  • పల్నాడు జిల్లాలో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ
  • రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలును ఆపిన దుండగులు
  • తెల్లవారుజామున ఎస్-1, ఎస్-2, ఎస్-3 బోగీల్లోకి ప్రవేశం
  • ముగ్గురు మహిళల నుంచి బంగారు ఆభరణాల చోరీ
  • రైలులో భద్రత లేకపోవడంపై ప్రయాణికుల తీవ్ర ఆగ్రహం
రైలు దోపిడీలకు దొంగలు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. ఏకంగా రైల్వే సిగ్నల్ వ్యవస్థనే ట్యాంపర్ చేసి, కదులుతున్న రైలును నిలిపివేసి మరీ దోపిడీకి పాల్పడ్డారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నాగర్‌సోల్ నుంచి నరసాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ దోపిడీకి గురైంది.

వివరాల్లోకి వెళితే, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ తెల్లవారుజామున 2.47 గంటలకు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వేస్టేషన్ సమీపానికి చేరుకుంది. మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి వద్దకు రాగానే, అప్పటికే అక్కడ మాటువేసిన దుండగులు పట్టాల పక్కన ఉన్న హోమ్ సిగ్నల్‌ను ట్యాంపర్ చేశారు. దీంతో రెడ్ సిగ్నల్ పడటంతో లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఇదే అదనుగా భావించిన దొంగల ముఠా రైలులోకి ప్రవేశించింది.

నిందితులు నేరుగా ఎస్-1, ఎస్-2, ఎస్-3 బోగీల్లోకి చొరబడి నిద్రిస్తున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇద్దరు మహిళల మెడలోంచి 68 గ్రాముల బంగారు గొలుసులను, మరో మహిళ మెడలోని రోల్డ్ గోల్డ్ గొలుసును లాక్కెళ్లారు. అనంతరం ఎస్-5 బోగీలోనూ చోరీకి ప్రయత్నించగా, కొందరు ప్రయాణికులు మేల్కొని గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో రైలు సుమారు 35 నిమిషాల పాటు అక్కడే నిలిచిపోయింది.

బాధితుల్లో ఒకరైన విజయవాడకు చెందిన శ్రీదేవి అనే ప్రయాణికురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రమేశ్ తెలిపారు. అయితే, ఇంత పెద్ద ఎక్స్‌ప్రెస్ రైలుకు భద్రతా సిబ్బంది లేకపోవడం వల్లే దొంగలు ఇంత ధైర్యంగా దోపిడీకి పాల్పడ్డారని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
Narsapur Express
Narsapur Express robbery
train robbery
Palnadu district
signal tampering
Nadukudi railway station
robbery in train
railway crime
Andhra Pradesh crime
gold robbery

More Telugu News