Droupadi Murmu: రాష్ట్రపతి, గవర్నర్‌ అధికారాల్లో కోర్టుల జోక్యం తగదు: బీజేపీ పాలిత రాష్ట్రాలు

Supreme Court Debates Governor Presidential Powers in Approving Bills
  • బిల్లుల వివాదంపై సుప్రీంలో బీజేపీ పాలిత రాష్ట్రాల వాదనలు
  • గవర్నర్లు, రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవని వెల్లడి
  • తమకు తాముగా రాజ్యాంగాన్ని మార్చే అధికారం కోర్టులకు లేదని వాదనలు
రాష్ట్రపతి, గవర్నర్‌ అధికారాల్లో కోర్టుల జోక్యం తగదని బీజేపీ పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి. శాసనసభలు పంపించిన బిల్లుల ఆమోదానికి తనకు గడువును నిర్దేశించడంపై పలు ప్రశ్నలు సంధిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ క్రమంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించాయి. అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఆయా రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతిదేనని మహారాష్ట్ర తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.

రాజ్యాంగం ప్రకారం.. బిల్లులకు సమ్మతి తెలపడం, తిరస్కరించడం లేదా  వాటిని తమ వద్దే నిలిపి ఉంచుకునే అధికారం రాష్ట్రపతి, గవర్నర్లకు మాత్రమే ఉంటుందని సాల్వే పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదని, న్యాయస్థానాలు తమంతట తాముగా రాజ్యాంగాన్ని మార్చలేవని ఆయన స్పష్టం చేశారు. బిల్లుల ఆమోదం విషయంలో గడువు విధించడం సబబు కాదని, ఆ అధికారం కోర్టులకు లేదని అన్నారు.

రాజకీయ సంప్రదింపుల తర్వాత గవర్నర్లు, రాష్ట్రపతి ఆ బిల్లులపై నిర్ణయం తీసుకుంటారని, దీనికి నిర్ణీత గడువు అంటూ ఏదీ లేదని చెప్పారు. ఆర్థిక బిల్లులను కూడా నిరవధికంగా నిలిపివేస్తే పరిస్థితి ఏంటని ధర్మాసనం ప్రశ్నించగా.. ఆర్థిక బిల్లుల ఆమోదానికి ప్రత్యేక పద్ధతి ఉందని హరీశ్ సాల్వే తెలిపారు. 

కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఆధ్వర్యంలోని ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ ఎ.ఎస్‌.చందూర్కర్‌ సభ్యులుగా ఉన్నారు.
Droupadi Murmu
President of India
Governors powers
Supreme Court
State Bills
Legislative assembly
Harish Salve
Constitution of India
Judicial review

More Telugu News