Banu Mushtaq: మైసూరు దసరా ఉత్సవాలకు బానూ ముస్తాక్‌కు ఆహ్వానం... రాజుకున్న రాజకీయ వివాదం

Banu Mushtaqs Invitation to Mysore Dasara Sparks Political Row
  • హిందూ వ్యతిరేక చర్య అంటూ బీజేపీ తీవ్ర అభ్యంతరం
  • దసరా అందరి పండగ అంటున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం
  • చాముండి ఆలయంపై డీకే శివకుమార్ వ్యాఖ్యలతో మరింత ముదిరిన వివాదం
కర్ణాటకలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభోత్సవానికి బుకర్ ప్రైజ్ గ్రహీత, రచయిత్రి బానూ ముస్తాక్‌ను ఆహ్వానించడం పెను రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ అంశం ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రస్థాయి మాటల యుద్ధానికి కారణమైంది. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తీవ్రంగా మండిపడటంతో ఈ వివాదం మరింత ముదిరింది.

"చాముండేశ్వరి ఆలయం హిందువులది మాత్రమే కాదంటూ డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నారు. ఆలయాలు లౌకిక ప్రదేశాలు (సెక్కులర్) కావు, అవి హిందువులకు చెందిన పవిత్ర స్థలాలు" అని శోభా కరంద్లాజే ఎక్స్ వేదికగా విమర్శించారు. దేవుళ్లను తిరస్కరించే బానూ ముస్తాక్‌ను దసరాకు ఆహ్వానించడం ద్వారా కాంగ్రెస్ తన హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని మరోసారి బయటపెట్టుకుందని ఆమె ఆరోపించారు.
బానూ ముస్తాక్ఈ వివాదంపై అంతకుముందు స్పందించిన డీకే శివకుమార్, ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. "హిందూ దేవాలయాలను మైనారిటీలు కూడా సందర్శిస్తారు. మనం కూడా మసీదులు, చర్చిలకు వెళ్తాం. దసరా అనేది సమాజంలోని అన్ని వర్గాల వారు జరుపుకునే పండుగ. చాముండి కొండ, చాముండేశ్వరి దేవి అందరికీ చెందినవి, అది హిందువుల ఆస్తి మాత్రమే కాదు" అని ఆయన స్పష్టం చేశారు. బానూ ముస్తాక్‌ను ఆహ్వానించాలన్నది ప్రభుత్వ నిర్ణయమని ఆయన తెలిపారు.

అయితే, బీజేపీ ఈ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. దసరా వేడుకలు మతపరమైనవని, లౌకిక కార్యక్రమం కాదని మాజీ ఎంపీ ప్రతాప్ సింహా అన్నారు. "బానూ ముస్తాక్‌కు చాముండేశ్వరి దేవిపై నమ్మకం ఉందా? ఆమె మన సంప్రదాయాలను పాటిస్తారా?" అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర మాట్లాడుతూ, "బానూ రచనలను అనువదించిన దీపా భాస్తిని ఎందుకు ఆహ్వానించలేదు? కేవలం బానూను మాత్రమే పిలవడంలో ఆంతర్యమేమిటి?" అని నిలదీశారు.

ఈ రాజకీయ రగడపై రచయిత్రి బానూ ముస్తాక్ కూడా స్పందించారు. తాను ఆహ్వానం మేరకు ఉత్సవాల ప్రారంభోత్సవానికి హాజరవుతానని స్పష్టం చేశారు. దసరా పండుగపైనా, చాముండేశ్వరి దేవిపైనా తనకు పూర్తి గౌరవం ఉందని తెలిపారు. "ఏ అంశాన్ని రాజకీయం చేయాలో, దేనిని చేయకూడదో రాజకీయ నాయకులకు తెలియాలి. కన్నడ భాషపై నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఏడాది బుకర్ ప్రైజ్ గెలుచుకున్న బానూ ముస్తాక్‌ను దసరా ఉత్సవాలకు ఆహ్వానించడం కర్ణాటకకే గర్వకారణమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు. 
Banu Mushtaq
Mysore Dasara
Karnataka politics
DK Shivakumar
Shobha Karandlaje
Chamundeshwari Temple
Hindu temple controversy
Siddaramaiah
BJP Congress conflict
Dasara festival

More Telugu News