Mahananda Reddy: తోపుదుర్తి సోదరులు నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు: వైసీపీ బహిష్కృత నేత మహానందరెడ్డి

 Thopudurthi Brothers Plotting to Kill Me Says Mahananda Reddy
  • మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందన్న మహానందరెడ్డి
  • తనను చంపేందుకు అధికార పార్టీ నేతలతో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపణ
  • అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కూడా కుట్రలో భాగస్వామి అన్న మహానందరెడ్డి
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఆయన సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని వైసీపీ బహిష్కృత నేత మహానందరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు వారు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహానందరెడ్డి ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రకాశ్‌రెడ్డి తనను అంతమొందించేందుకు ప్రస్తుత అధికార పార్టీ నేతలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారని మహానందరెడ్డి తెలిపారు. అనంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ కూడా ఈ కుట్రలో భాగస్వామి అని, పోలీసుల ద్వారా తనను అక్రమంగా అరెస్టు చేయించి హత్య చేయించాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచే తన హత్యకు ప్రకాశ్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అమెరికాలో ఉన్న తన అన్న కుమారుడికి ఫోన్ చేసి, "మీ చిన్నాన్నను చంపేస్తాం" అని ప్రకాశ్‌రెడ్డి బెదిరించినట్లు ఆయన వెల్లడించారు.

తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చేసిన భూకబ్జాలకు సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని మహానందరెడ్డి హెచ్చరించారు. ఉప్పరపల్లిలోని వంక పోరంబోకు భూములు, బెంగళూరు రోడ్డులో మాజీ సైనికుడి పేరుతో సృష్టించిన భూములను ప్రకాశ్‌రెడ్డి కాజేశారని ఆరోపించారు. ఈ విషయాలు బయటపెడతాననే భయంతోనే తనను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు.

రాజకీయ కారణాలతో ఇప్పటికే తన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయానని మహానందరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న ప్రసాద్‌రెడ్డి హత్య కేసులోని నిందితులను ప్రకాశ్‌రెడ్డి తన వెంట తిప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో తన భార్య 33 ఓట్ల మెజారిటీతో గెలిచినా, ఓడిపోయిన టీడీపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. 
Mahananda Reddy
Thopudurthi Prakash Reddy
Andhra Pradesh Politics
Anantapur
YSRCP
TDP
Murder Conspiracy
Land Grabbing
Daggubati Prasad
Political Rivalry

More Telugu News