పంజాబ్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. పసికందు తలతో కుక్క సంచారం!

  • పంజాబ్‌లోని పాటియాలా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
  • పసికందు తలను నోట కరచుకుని తిరిగిన ఓ కుక్క
  • ఆసుపత్రిలో పుట్టిన శిశువు కాదని అధికారుల ప్రాథమిక నిర్ధారణ
  • బయటి నుంచి మృతదేహాన్ని పడేశారని ఆసుపత్రి వర్గాల అనుమానం
  • ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆరోగ్య మంత్రి ఆదేశం
పంజాబ్‌లోని పాటియాలాలో ఉన్న రాజింద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత దారుణమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగుచూసింది. ఆసుపత్రి ఆవరణలో ఓ కుక్క నవజాత శిశువు తలను నోట కరచుకుని తిరుగుతూ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ అమానవీయ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో ఆసుపత్రిలోని వార్డ్ నంబర్ 4 సమీపంలో ఓ కుక్క పసికందు తలతో సంచరించడాన్ని కొందరు గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రి అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని, స్థానిక పోలీసులను ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న శిశువు తలను ఫోరెన్సిక్ విచారణ కోసం పంపించామని, ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఘటనపై ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విశాల్ చోప్రా ప్రాథమిక నివేదికను సమర్పించారు. తమ ఆసుపత్రిలో ఇటీవల జన్మించిన శిశువులందరూ క్షేమంగా ఉన్నారని, ఏ ఒక్కరూ తప్పిపోలేదని ఆయన తెలిపారు. ఇటీవలే ముగ్గురు శిశువులు మరణించగా, వారి మృతదేహాలను అన్ని లాంఛనాలు పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించామని వివరించారు. "ప్రాథమికంగా చూస్తే, ఎవరో బయటి నుంచి శిశువు మృతదేహాన్ని ఆసుపత్రి ప్రాంగణంలోకి విసిరేసినట్లు అనిపిస్తోంది" అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఎస్పీ పల్విందర్ సింగ్ చీమా మాట్లాడుతూ, "కుక్క నోట ఉన్నది నవజాత శిశువు తల అని వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రిలో ఉన్న శిశువుల జాబితాను, మరణించిన శిశువుల వివరాలను తీసుకుని అన్నింటినీ సరిచూస్తున్నాం. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని" ఆయన తెలిపారు. ఈ అమానవీయ ఘటనకు ఎవరు కారణమనేది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.


More Telugu News