Raghunandan Rao: పీసీసీ అధ్యక్షుడిగా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు: రఘునందన్ రావు

Raghunandan Rao Warns TPCC Chief Against Baseless Comments
  • ఓటు చోరీకి పాల్పడితే అన్ని పార్లమెంట్ స్థానాలను బీజేపీయే గెలిచేదన్న ఎంపీ
  • అందరం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళదామా? అని సవాల్
  • కాంగ్రెస్ ఎనిమిది చోట్ల ఎలా గెలిచిందని ప్రశ్న
పీసీసీ అధ్యక్షుడిగా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని, ఓటు చోరీకి పాల్పడి ఉంటే దేశంలోని అన్ని పార్లమెంట్ స్థానాలను తామే గెలుస్తామని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యత మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎంపీలందరం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళతామని, దానికి కాంగ్రెస్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. రాజీనామా చేసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.

మేం ఓట్ల చోరీకి పాల్పడినట్టయితే, తెలంగాణలో కాంగ్రెస్ ఎనిమిది చోట్ల ఎలా గెలిచింది, అసదుద్దీన్ ఒవైసీ ఎలా విజయం సాధించారని నిలదీశారు. దమ్ముంటే మీ ఎనిమిది మంది ఎంపీలతో రాజీనామా చేయించాలని, తాము కూడా రాజీనామా చేస్తామని అన్నారు. కొత్త ఓటరు లిస్టుతో మళ్లీ ఎన్నికలకు వెళదామని వ్యాఖ్యానించారు. అప్పుడు వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుస్తాయని అన్నారు.

బీజేపీని అడిగి కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. కుంటిసాకులు చెప్పకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై నిజాయతీగా కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ లోపం కారణంగానే యూరియా కొరత తలెత్తిందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని యూరియా కొరత ఇక్కడే ఎందుకు ఉందని ప్రశ్నించారు.
Raghunandan Rao
TPCC
Mahesh Kumar Goud
BJP
Telangana Congress
Parliament Elections
Vote Rigging

More Telugu News