Vijay Thalapathy: నేను నాశనమయ్యా.. విజయ్ రెమ్యునరేషన్ డబుల్ అయింది: ‘పులి’ నిర్మాత ఆవేదన

PT Selvakumar Says Vijay Ignored Him After Puli Movie Flop
  • 27 ఏళ్ల కష్టార్జితాన్ని, ఆస్తులు అమ్మి 'పులి' సినిమా తీశానన్న నిర్మాత సెల్వకుమార్
  • సినిమా పరాజయం తర్వాత విజయ్ తనను దూరం పెట్టాడని ఆవేదన
  • ఆ సినిమాతో తన కలలు, కృషి సర్వనాశనం అయ్యాయని కన్నీటిపర్యంతమైన వైనం  
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌పై ఆయన మాజీ మేనేజర్, ‘పులి’ చిత్ర నిర్మాత పీటీ సెల్వకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పులి’ సినిమా వైఫల్యంతో తాను ఆర్థికంగా సర్వస్వం కోల్పోతే, విజయ్ పారితోషికం మాత్రం రెట్టింపు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సినిమా పరాజయం తర్వాత విజయ్ తనను పూర్తిగా దూరం పెట్టారని, కనీసం ఓదార్పు మాట కూడా చెప్పలేదని ఆయన ఆరోపించారు.

2015లో చింబు దేవన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘పులి’ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన విషయం తెలిసిందే. శ్రీదేవి, సుదీప్, హన్సిక వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా, విడుదలైన తొలిరోజే డిజాస్టర్‌ టాక్‌ను మూటగట్టుకుంది. ఈ సినిమా ఫలితంపై తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన సెల్వకుమార్‌ భావోద్వేగానికి గురయ్యారు.

"సినిమా విడుదలకు ఒక రోజు ముందు కుట్రపూరితంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. నా పక్కన ఉన్నవారే ఈ కుట్రకు పాల్పడ్డారు. నా 27 ఏళ్ల కష్టార్జితాన్ని, ఆస్తులను అమ్మి ఈ సినిమా తీశాను. కానీ తొలిరోజే నెగెటివ్ రివ్యూలు రావడంతో ప్రేక్షకులు థియేటర్ల నుంచి మధ్యలోనే వెళ్లిపోవడం కళ్లారా చూసి తట్టుకోలేకపోయాను. ఆ సమయంలో నా స్థానంలో ఎవరున్నా ఆత్మహత్య చేసుకునేవారు" అని సెల్వకుమార్‌ వాపోయారు.

సినిమా పరాజయం తర్వాత విజయ్ తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదని ఆయన తెలిపారు. "ఈ సినిమా ఫ్లాప్ విజయ్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. పైగా ఆయన పారితోషికం డబుల్ అయింది. ‘పులి’ చిత్రానికి రూ. 25 కోట్లు తీసుకున్న విజయ్, ఆ తర్వాత సినిమాకు రూ. 45 కోట్లు తీసుకున్నారు. కానీ వాళ్లు మాత్రం నన్ను ఓ దేశద్రోహిలా, విఫలమైన వ్యక్తిలా చూశారు. ఆ సినిమాతో నా కలలు, కృషి సర్వనాశనం అయ్యాయి" అని సెల్వకుమార్‌ కన్నీటిపర్యంతమయ్యారు. 
Vijay Thalapathy
Vijay Puli Movie
PT Selvakumar
Puli Movie Failure
Tamil Cinema
Vijay Remuneration
Sridevi Puli
Chimbu Devan
Kollywood News

More Telugu News