ఏటీఎంలపై బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు

  • ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు తప్పనిసరి
  • బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు ఆర్‌బీఐ ఆదేశాలు
  • సెప్టెంబర్ 30 లోపు అమలు చేయాలన్న ఆర్బీఐ
ఏటీఎంలలో రూ. 100, రూ. 200 నోట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఊరట కల్పించింది. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలలో ఈ డినామినేషన్ నోట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని బ్యాంకులకు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ప్రజలు ఎదుర్కొంటున్న చిల్లర కష్టాలకు త్వరలోనే తెరపడనుంది.

ఈ సమస్య కారణంగా చాలామంది చిన్న లావాదేవీలకు కూడా యూపీఐ చెల్లింపులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది చిరు వ్యాపారులు, సాధారణ ప్రజలపై ప్రభావం చూపుతోందని గుర్తించిన ఆర్‌బీఐ, ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.

ఈ ఆదేశాల ప్రకారం, ప్రతి ఏటీఎంలో కనీసం ఒక క్యాసెట్‌ను రూ. 100 లేదా రూ. 200 నోట్ల కోసం కేటాయించాలి. ఇందుకు అనుగుణంగా దశలవారీగా మార్పులు చేయాలని బ్యాంకులకు స్పష్టమైన గడువు విధించింది. సెప్టెంబర్ 30 నాటికి దేశంలోని 75 శాతం ఏటీఎంలు, 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో ఈ సౌకర్యం అందుబాటులోకి రావాలని స్పష్టం చేసింది.

ఈ మార్పుల కోసం బ్యాంకులు కొత్తగా ఏటీఎం యంత్రాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న యంత్రాల సామర్థ్యాన్ని బట్టి వాటిలో చిన్న సర్దుబాట్లు చేస్తే సరిపోతుందని సూచించింది. ఆర్‌బీఐ తాజా ఆదేశాలతో ఇకపై ఏటీఎంలలో చిన్న నోట్ల లభ్యత గణనీయంగా పెరగనుంది.


More Telugu News