Sunil Gavaskar: మా విషయంలో వేలు పెట్టొద్దు.. మా క్రికెట్ గురించి మీకెందుకు?: విదేశీ మాజీ క్రికెటర్లపై గవాస్కర్ ఫైర్

Sunil Gavaskars Sharp Attack Over Asia Cup Squad Debate
  • ఆసియా కప్ జట్టు ఎంపికపై విదేశీయుల విమర్శలు
  • మాజీ క్రికెటర్ల తీరుపై తీవ్రంగా స్పందించిన గవాస్కర్
  • భారత క్రికెట్ గురించి మాట్లాడే హక్కు వారికి లేదన్న సన్నీ
  • సోషల్ మీడియా వ్యూస్ కోసమే ఈ వ్యాఖ్యలని ఆరోపణ
  • విదేశీయుల జోక్యం సరికాదని ఘాటు వ్యాఖ్యలు
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, విదేశీ మాజీ క్రికెటర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత జట్టు ఎంపిక వంటి అంతర్గత విషయాల్లో వారు తలదూర్చడంపై మండిపడ్డాడు. భారత క్రికెట్‌తో ఏమాత్రం సంబంధం లేని వారు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికాడు.

యూఏఈ వేదికగా మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. అయితే, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ వంటి కొందరు ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కకపోవడంపై చర్చ జరుగుతోంది. ఈ విషయంపై దేశంలో అభిమానులు, నిపుణులు చర్చించుకోవడం సహజమేనని, కానీ విదేశీయులు జోక్యం చేసుకోవడాన్ని మాత్రం సహించలేనని గవాస్కర్ స్పష్టం చేశాడు.

‘స్పోర్ట్‌స్టార్’కు రాసిన తన కాలమ్‌లో గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "భారత క్రికెట్‌తో ఎలాంటి ప్రమేయం లేని, దాని గురించి పెద్దగా అవగాహన కూడా లేని విదేశీయులు ఈ చర్చలో దూరి నిప్పుకు ఆజ్యం పోయడం ఆశ్చర్యంగా ఉంది. భారత జట్టు ఎంపిక పూర్తిగా మా సొంత విషయం. వారు వారి దేశ క్రికెట్‌పై దృష్టి పెడితే మంచిది" అని గవాస్కర్ ఘాటుగా పేర్కొన్నారు. భారత మాజీ క్రికెటర్లు ఎప్పుడూ ఇతర దేశాల జట్ల ఎంపికపై మాట్లాడరని ఆయన గుర్తుచేశాడు.

సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోవర్లను పెంచుకోవడానికే కొందరు విదేశీయులు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. "భారత క్రికెట్‌పై, మన ఆటగాళ్లపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం ద్వారా భారత అభిమానులను రెచ్చగొట్టి, తద్వారా తమ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటున్నారు. ఇది వారికి ఒక జీవనోపాధిగా మారింది" అని స‌న్నీ అన్నాడు.

ఈ విషయంలో భారత మీడియాను కూడా గవాస్కర్ తప్పుబట్టాడు. "విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మన మీడియా ప్రతినిధులు, వారి దేశంలోనే దాదాపు మర్చిపోయిన మాజీ ఆటగాళ్ల వెంటపడి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. భారత క్రికెట్‌కు వారి నుంచి ఆమోదం పొందాలన్నట్లుగా ప్రవర్తించడం సరికాదు" అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Sunil Gavaskar
Indian Cricket
Asia Cup 2025
Suryakumar Yadav
Shreyas Iyer
Yashasvi Jaiswal
BCCI
Cricket Team Selection
Foreign Cricketers
Cricket News

More Telugu News