Sanjay: ఫైర్ సేఫ్టీ స్కామ్: ఐపీఎస్ సంజయ్‌కు 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు

Sanjay IPS Remanded in Fire Safety Equipment Scam
  • అవినీతి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఐపీఎస్ సంజయ్ లొంగుబాటు
  • సెప్టెంబర్ 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
  • విజయవాడ జైలుకు తరలించిన పోలీసులు
ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఈరోజు లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన కోర్టు ముందు హాజరుకాగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 8 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అనంతరం ఏసీబీ అధికారులు సంజయ్‌ను విజయవాడ జైలుకు తరలించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంజయ్ సీఐడీ చీఫ్‌గా పనిచేసినప్పుడు ఈ అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవగాహన కల్పించే కార్యక్రమాల కోసం ఫైర్ సేఫ్టీ పరికరాలు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో, ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై రూ.1.19 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ తొలుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ ఏడాది జనవరి 30న హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేయగా, సర్వోన్నత న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. మూడు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాలని, ఆ తర్వాతే సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ సంజయ్ ఇవాళ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. 
Sanjay
IPS Sanjay
Fire Safety Scam
Vijayawada ACB Court
Judicial Remand
Corruption Case
AP High Court
Supreme Court
CID Chief

More Telugu News