ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ కలకలం.. చేతిపై ఆ తెల్లటి మచ్చ ఏంటి?

  • ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి మొదలైన ఊహాగానాలు
  • కుడిచేతిపై కనిపించిన వింత తెల్లటి మచ్చ
  • ఓవల్ ఆఫీస్‌ సమావేశంలో కెమెరా కంటపడిన దృశ్యం
  • గతంలోనూ చేతులపై కమిలిన గాయాలు, వాపులు
  • మేకప్‌తో గాయాన్ని కప్పిపుచ్చారని ప్రచారం
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న ట్రంప్ మద్దతుదారులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఆయన చేతులపై కనిపిస్తున్న వింత గాయాలు, మచ్చలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. తాజాగా ఆయన కుడిచేతిపై కనిపించిన ఓ తెల్లటి గుర్తు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కొత్త ఆందోళనలను రేకెత్తిస్తోంది.

వివరాల్లోకి వెళితే... సోమవారం ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఒక సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుడిచేతి వెనుక భాగంలో ఒక స్పష్టమైన తెల్లటి గుర్తు కెమెరాల కంటపడింది. ఇది చూసిన చాలామంది, ముఖ్యంగా ఆయన మద్దతుదారులు, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ గాయాన్ని కప్పిపుచ్చేందుకే మేకప్‌తో ప్రయత్నించినట్లుగా కనిపిస్తోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు రావడం ఇదే మొదటిసారి కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచే ఆయన ఏదో వింత వ్యాధితో బాధపడుతున్నారనే వదంతులు ఉన్నాయి. ఇటీవలే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్‌తో సమావేశమైనప్పుడు కూడా ఆయన చేతులపై కమిలిన గాయాలు కనిపించాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో జరిగిన ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ కార్యక్రమానికి హాజరైనప్పుడు, ఆయన కాళ్ల వద్ద నరాలు ఉబ్బినట్లు, చేతులపై వాపులు ఉన్నట్లు ఫొటోలలో స్పష్టంగా కనిపించింది.

ఇలా వరుసగా ఆయన చేతులపై గాయాలు కనిపిస్తుండటంతో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై జరుగుతున్న ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ గాయాలకు గల కారణాలపై ట్రంప్ బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


More Telugu News