Bandi Sanjay: కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా... పీసీసీ చీఫ్ ఒక గజినీ: బండి సంజయ్

Bandi Sanjay Challenges Congress Victory He Will Retire From Politics
  • బీజేపీ ఎంపీల గెలుపుపై దొంగ ఓట్ల ఆరోపణలను ఖండించిన బండి సంజయ్
  • ఆరు గ్యారంటీల హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్న
  • కరీంనగర్‌లో ఒకే మైనారిటీ ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయని ఆరోపణ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమని, కరీంనగర్‌తో పాటు 8 నియోజకవర్గాల ప్రజలను అవమానించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి దొంగ ఓట్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. "గతంలో నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పుడు, ఒక బీసీగా స్పందించానని చెప్పిన మహేశ్ గౌడ్, ఇప్పుడు నేను బీసీని కాదని చెప్పడం విడ్డూరం. ఆయన్ను చూస్తే నాకు గజినీ సినిమా గుర్తుకొస్తోంది" అంటూ ఎద్దేవా చేశారు. దొంగ ఓట్ల గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు, జగిత్యాలలో జరిగిన ఓట్ల చోరీ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. "మహిళలకు ఇస్తామన్న రూ. 2,500, పెంచుతామన్న పింఛన్లు, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, తులం బంగారం, స్కూటీలు ఎక్కడికి పోయాయి రేవంత్ రెడ్డి?" అని నిలదీశారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని, త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ నేతలను రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు నయా పైసా కూడా విడుదల చేయలేదని దుయ్యబట్టారు.

బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్‌లోని కొన్ని మైనారిటీ ఇళ్లలో ఒక్కో ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం కోసం బీజేపీ ఎప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు.

 "భైంసాలో హిందువుల ఇళ్లు తగలబెట్టినప్పుడు ఈ కాంగ్రెస్ నేతలు ఎక్కడికి పోయారు? హిందూ పండుగలకు గుళ్లలో సౌండ్ పెట్టొద్దని చెప్పడం దుర్మార్గం" అని మండిపడ్డారు. యూపీఏ హయాంలోనే దేశంలోకి రోహింగ్యాలు పెద్ద ఎత్తున ప్రవేశించారని, టోపీలు పెట్టుకుని డ్రామాలు ఆడేది కాంగ్రెస్ నేతలేనని ఆయన విమర్శించారు.
Bandi Sanjay
Telangana politics
Congress party
Mahesh Kumar Goud
BJP
BC reservations
Karimnagar
Telangana elections
Fake votes

More Telugu News