Rajinikanth: రజనీ ఇదెక్కడి మాయ .. ఇదెక్కడి మంత్రం!

Rajanikanth Special
  • ఈ నెల 14న విడుదలైన 'కూలీ'
  • భారీ ఓపెనింగ్స్ తో మొదలైన రికార్డులు
  • 12 రోజుల్లో 500 కోట్ల వసూళ్లు
  • రజనీ కెరియర్లో ఇది మూడో సినిమా

రజనీకాంత్ సినిమాలు చూస్తూ ఎదిగినవాళ్లు .. ఆయన స్పూర్తితో సినిమాల్లోకి వెళ్లినవారు .. ఆయనతో కలిసి పనిచేయాలనే కోరికను నెరవేర్చుకున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు. సినిమాకి సంబంధించిన టెక్నాలజీ మారిపోతోంది .. కొత్త కొత్త దర్శకులు బరిలోకి దిగుతున్నారు .. కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. అయినా రజనీ పరుగు మాత్రం ఇంతవరకూ ఆగలేదు. అవుట్ డేటెడ్ అనే మాట కూడా ఆయనకి చాలా దూరంలోనే ఆగిపోయింది.

రజనీతో పాటు ఎంట్రీ ఇచ్చిన కమల్ ను పక్కన పెడితే, ఆ తరువాత చాలా మంది హీరోలు తెరపైకి వచ్చారు. కొంతకాలం తరువాత వారి ప్రభ మసకబారడం, వాళ్లు ఇతర కేరక్టర్స్ వైపు వెళ్లిపోవడం జరిగింది. కానీ రజనీ జోరు మాత్రం మరింత రెట్టింపు అవుతూ దూసుకుపోతూనే ఉంది. ఆయన ఏ మాయ చేస్తున్నాడో .. ఏం మంత్రం వేస్తున్నాడో గానీ ఇంకా థియేటర్స్ కి పొలోమంటూ జనాలను రప్పిస్తూనే ఉన్నాడు. చాలా కాలంగా వెలవెలబోతూ వచ్చిన థియేటర్లు, రీసెంటుగా 'కూలీ' సినిమాతో హౌస్ ఫుల్ కావడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తరాలు మారుతున్న రజనీ క్రేజ్ కొనసాగుతూ ఉండటం నిజంగా ఆశ్చర్యమే. 

ఆగస్టు 14న విడుదలైన 'కూలీ' పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే అభిప్రాయాలు వినిపించాయి. లోకేశ్ కనగరాజ్ చేసిన కొన్ని పొరపాట్లను గురించిన చర్చలు నడిచాయి. అయితే రజనీ క్రేజ్ మాత్రం ఈ సినిమాను రికార్డుల దిశగా లాక్కెళుతూనే ఉంది. విడుదలైన 12వ రోజున (సోమవారం) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. గతంలో ఈ క్లబ్ లో '2.0' .. 'జైలర్' ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసనే 'కూలీ' చేరింది. 500 కోట్ల క్లబ్ లో మూడు సినిమాలు ఉన్న ఏకైక తమిళ హీరో రజనీకాంత్ మాత్రమేనని చెబుతున్నారు. ఇప్పుడు కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 

Rajinikanth
Coolie movie
Tamil cinema
Kollywood news
Lokesh Kanagaraj
2.0 movie
Jailer movie
Indian films
Box office collection

More Telugu News