Chandrababu Naidu: మండలానికో ‘జన ఔషధి’ స్టోర్... బీసీ యువతకు ఉపాధి: సీఎం చంద్రబాబు నిర్ణయం

Chandrababu Naidu Focuses on Jan Aushadhi Stores for BC Youth Employment
  • వైద్య రంగంపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • అధికారులకు కీలక ఆదేశాలు
  • ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ. 25 లక్షల వరకు ఆరోగ్య బీమా విస్తరణ
  • ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ప్రణాళిక
  • కుప్పంలో 45 రోజుల్లో ఉచిత వైద్య పరీక్షల పైలట్ ప్రాజెక్టు పూర్తికి ఆదేశం
  • యోగా, నేచరోపతి ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు, యూనివర్సిటీ ఏర్పాటు యోచన
రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, ఆరోగ్య బీమాలో మార్పులు, కొత్త వైద్య కళాశాలలు, ఉచితంగా వైద్య పరీక్షలు, యోగా-నేచురోపతి అభివృద్ధి వంటి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. పేదలపై భారం తగ్గేలా ప్రతీ మండలంలో జనరిక్ ఔషధాలు లభించేలా చూడాలని భావిస్తున్న ముఖ్యమంత్రి... దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనఔషధి స్టోర్లు పెట్టేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి పెద్దఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే వాటికి అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో పేదలకు తక్కువ ధరకే మెడిసిన్స్ లభించడమే కాకుండా, బీసీ యువతకు విస్తృతంగా ఉపాధి లభించేందుకు మార్గం సుగుమం అయ్యింది.

రూ.25 లక్షల వరకు వైద్య బీమాపై కసరత్తు 

ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.25 లక్షల వరకు వైద్య బీమా అందించే అంశంపైనా సమీక్షలో చర్చించారు. ప్రస్తుతం ఉన్న విధానం ద్వారా 1.43 కోట్ల కుటుంబాలకు మాత్రమే లబ్ది కలుగుతుండగా, దీనిని 1.63 కోట్ల కుటుంబాలకు వర్తించేలా మార్పులు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇది అమలైతే 5.02 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు.

ప్రతీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి

ప్రతీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోనిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల పురోగతిపైనా చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది జనాభాకు 2.24 బెడ్స్ ఉండగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశకాల ప్రకారం 3 బెడ్లు ఉండాలని సూచించిందని అన్నారు. దీనిప్రకారం రాష్ట్రంలో మరో 12,756 పడకలు అందుబాటులోకి తేవాల్సి ఉందని.... దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

ఆరోగ్య సూత్రాలు పాటించేలా అవగాహన 

వివిధ వ్యాధులతో చికిత్స పొందేందుకు ఆసుపలకు రావడం కన్నా... అనారోగ్యం పాలవ్వకుండా ముందగానే జాగ్రత్తపడేలా, ప్రజలంతా ఆరోగ్య సూత్రాలు పాటించేలా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఇందుకోసం యోగా, నేచురోపతిని ప్రమోట్ చేసేలా ‘యోగా ప్రచార పరిషత్’ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 3 రీజనల్ స్టడీ సెంటర్లలో 64 మంది సభ్యులను నియమించేందుకు అనుమతించారు. అమరావతి పరిధిలో నేచురోపతి యూనివర్సిటీ ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు

45 రోజుల్లోగా కుప్పంలో ఉచిత వైద్య పరీక్షలు

రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే క్రమంలో తలపెట్టిన ఉచిత వైద్య పరీక్షల పైలెట్ ప్రాజెక్టును కుప్పం నియోజకవర్గంలో 45 రోజుల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, శాంతిపురం, రామకుప్పంతో పాటు మరిన్ని ల్యాబ్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, అలాగే శాంపిల్ కలెక్షన్ టీమ్‌లు పెంచాలని స్పష్టం చేశారు.

ప్రతీ గ్రామానికి ‘ఆరోగ్య రథం’ 

‘ఆరోగ్యం రథం’తో ప్రతీ పల్లెలోనూ మొబైల్ వైద్యసేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 108 వాహనాల సిబ్బందికి యూనిఫామ్ అమలు చేయాలని నిర్దేశించారు. మరోవైపు ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు తీసుకొచ్చిన పలురకాల కిట్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. బేబీ కిట్స్ పథకం త్వరలోనే అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మోడల్ ఇంక్లూజివ్ సిటీగా అమరావతి 

పెర్కిన్స్ ఇండియా - ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ భాగస్వామ్యంతో అమరావతిలో ‘మోడల్ ఇన్‌క్లూజివ్ సిటీ’ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. దీనిపై ఆ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర విద్య, సమాన హక్కులు, అందరికీ అందుబాటులో మౌలిక వసతులను సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. బారియర్ ఫ్రీ పబ్లిక్ ప్లేస్, ఇన్‌క్లూజివ్ రోడ్ డిజైన్, అందరికీ అందుబాటులో ఉండేలా ప్రజా రవాణా సౌకర్యాలు రూపకల్పన, డిజిటల్ స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ మోడల్ స్కూల్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రతి పిల్లవాడు తన సహచరులతో సమానంగా నేర్చుకునే వాతావరణం కల్పించడం, ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు వంటివి చేస్తామని చెప్పారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రావాలని సూచించారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Jan Aushadhi Stores
BC Corporation
Medical Insurance
Healthcare
Free Medical Tests
NTR Vaidya Seva
Amaravati
YOGA

More Telugu News