ఆర్సీబీ కోచ్‌గా ఏబీ డివిలియర్స్?.. రీఎంట్రీపై మిస్టర్ 360 ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ఐపీఎల్‌లోకి రీఎంట్రీపై సంకేతాలిచ్చిన ఏబీ డివిలియర్స్
  • ఈసారి కోచ్ లేదా మెంటార్ పాత్రలో కనిపించే అవకాశం
  • నా హృదయం ఎప్పుడూ ఆర్సీబీతోనే ఉంటుందన్న మిస్టర్ 360
  • ఫ్రాంచైజీ కోరితే తప్పకుండా వస్తానని వెల్లడి 
  • పూర్తిస్థాయి ప్రొఫెషనల్ బాధ్యతలు కష్టమని వ్యాఖ్య
దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం, మిస్టర్ 360గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఏబీ డివిలియర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోకి తిరిగి వచ్చే అవకాశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఈసారి ఆటగాడిగా కాకుండా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు కోచ్ లేదా మెంటార్ వంటి కొత్త పాత్రలో కనిపించవచ్చని సంకేతాలిచ్చాడు. ఆయన వ్యాఖ్యలతో ఆర్‌సీబీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఇటీవల ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, డివిలియర్స్ తన భవిష్యత్ ప్రణాళికల గురించి పంచుకున్నాడు. "భవిష్యత్తులో నేను మళ్లీ ఐపీఎల్‌తో అనుబంధం ఏర్పరచుకోవచ్చు. కానీ పూర్తి సీజన్ పాటు ప్రొఫెషనల్‌గా కట్టుబడి ఉండటం చాలా కష్టం. ఆ రోజులు ముగిశాయని నేను భావిస్తున్నాను. అయినా, ఎప్పుడూ ఏదీ జరగదని చెప్పలేం. నా మనసంతా ఎప్పుడూ ఆర్‌సీబీతోనే ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు, ఫ్రాంచైజీకి నా అవసరం ఉందనిపిస్తే, కోచ్ లేదా మెంటార్ పాత్రలో తిరిగి రావడం కచ్చితంగా ఆర్‌సీబీతోనే ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశాడు.

2021లో అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్, ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం పాటు ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టు తరఫున 157 మ్యాచ్‌లు ఆడి 41.10 సగటు, 158.33 స్ట్రైక్ రేట్‌తో 4,522 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీతో కలిసి గుజరాత్ లయన్స్‌పై రెండో వికెట్‌కు 229 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.

తన ఐపీఎల్ కెరీర్‌ను 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ప్రారంభించిన డివిలియర్స్, మూడు సీజన్ల తర్వాత 2011లో ఆర్‌సీబీలో చేరాడు. తన అద్భుతమైన ఆటతీరుతో ఆ జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. 2022లో క్రిస్ గేల్‌తో పాటు డివిలియర్స్‌ను ఆర్‌సీబీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చేర్చి గౌరవించింది.


More Telugu News