వినాయకుడికి విదేశాల్లోనూ పూజలు.. పేర్లు వేరైనా మూర్తి మాత్రం ఆయనే!

  • శుభకార్యాల్లో హిందువుల తొలి పూజ గణనాథుడికే
  • థాయ్ ప్రజలకు అదృష్ట దేవతగా బొజ్జ గణపయ్య
  • ఇండోనేసియా కరెన్సీపై ఏకదంతుడి చిత్రం
  • కష్టాలను కడతేర్చే దైవంగా జపనీయుల పూజలు
హిందూ సంస్కృతిలో పండుగలు, శుభకార్యాల్లో తొలి పూజ వినాయకుడికే! ఏటా వినాయక చవితికి వాడవాడలా విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తులు పదకొండు రోజులు పూజలు చేస్తుంటారు. అయితే, మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ వినాయకుడిని వివిధ రూపాలు, పేర్లతో భక్తులు కొలుచుకుంటారు. ప్రపంచంలో అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటైన అంగ్ కోర్ వాట్ లోనూ గణపతి విగ్రహం ఉంది. పొరుగున ఉన్న నేపాల్ తో పాటు మయన్మార్, థాయ్ లాండ్, జపాన్ తదితర దేశాల్లోనూ బొజ్జ గణపయ్యను అక్కడి భక్తులు కొలుచుకుంటారు. పేర్లు వేరైనా మూర్తి మాత్రం ఆయనదే. ఇక ఏయే దేశాల్లో ఏకదంతుడు ఏయే పేర్లతో పూజలు అందుకుంటాడంటే..

నేపాల్‌
నేపాలీయులు పండుగలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించే సమయంలో, దశైన్ పండుగకు గణేశుడిని విస్తృతంగా పూజిస్తారు. దేశంలోని వివిధ ఆలయాల్లో గణపతి చిత్రం కనిపిస్తుంది.
 
థాయిలాండ్‌
థాయిలాండ్ ప్రజలు మన గణపయ్యను ఫ్రా ఫికనెట్ అని పిలుచుకుంటారు. అదృష్టం, విజయాన్నిచ్చే దైవంగా ఆరాధిస్తారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వినాయకుడి ఆలయాలు కూడా ఉన్నాయి.
 
కంబోడియా
కంబోడియాలోని పురాతన దేవాలయం అంగ్ కోర్ వాట్ లో వినాయక విగ్రహం కనిపిస్తుంది. అక్కడి ప్రజలు తాము చేపట్టిన పనిలో విజయం సాధించేందుకు వినాయకుడిని ప్రార్థిస్తారు. 

ఇండోనేసియా
జ్ఞానం, తెలివి తేటలు ఇచ్చే దైవంగా ఇండోనేసియా ప్రజలు గణేశుడిని కొలుస్తారు. ఇక్కడి కరెన్సీ నోట్లపైనా వినాయకుడి చిత్రం ఉంటుంది. ఇండోనేసియాలో 1వ శతాబ్దానికి చెందిన విగ్రహాలు బయటపడ్డాయి.

 
వియత్నాం
వియత్నాం ప్రజలకు గణేశుడు అత్యంత పూజనీయమైన దైవం. ప్రధానంగా వ్యవసాయదారులు గణపతిని పూజిస్తారు.

జపాన్‌
జపాన్ లోని దాదాపు 250 ఆలయాల్లో ‘కంగిటెన్’ పేరుతో గణేశుడు పూజలు అందుకుంటున్నాడు. కష్టాలు తీర్చే దైవంగా అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.

చైనా

సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా చైనీయులు గణేశుడిని పూజిస్తారు. స్థానిక ఆచారాలలో గణపతిని పూజిస్తారు.

టిబెట్‌
టిబెటన్ బౌద్ధమతంలో కలిసి వినాయకుడు స్థానికుల పూజలు అందుకుంటున్నాడు. టిబెట్ లో గణేశుడు వివిధ రూపాల్లో కనిపిస్తాడు. తమ రక్షక దేవతగా అక్కడి ప్రజలు కొలుచుకుంటారు.

మయన్మార్‌

దేశంలోని ప్రముఖ ఆలయం శ్వేశాంద్ పగోడాతో పాటు వివిధ ఆలయాలలో వినాయకుడికి నిత్య పూజలు జరుగుతుంటాయి. అడ్డంకులను తొలగించే దైవంగా మయన్మార్ ప్రజలు వినాయకుడిని కొలుస్తారు. బౌద్ధ ఆచారాలలో గణపతి పూజ కలిసి పోయింది.

మంగోలియా
ఈ దేశంలో కొన్ని బౌద్ధ ఆచారాలలో గణేశుడిని పూజిస్తారు. అక్కడ ఆయనను రక్షకుడిగా, అదృష్ట దేవతగా భావిస్తారు.


More Telugu News