కీలకంగా మారిన ఐఫోన్ పాస్ వర్డ్.. ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు పోలీసుల నోటీసులు

  • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను తిరిగి ప్రారంభించిన పోలీసులు
  • ఎమ్మెల్సీ అనంతబాబు ఐఫోన్‌తో దర్యాప్తులో కొత్త చిక్కులు
  • ఫోన్ స్వాధీనం చేసుకుని పాస్‌వర్డ్ తీసుకోని పాత దర్యాప్తు బృందం
  • కీలకమైన వాట్సాప్ కాల్స్, వీడియోల సేకరణకు ఆటంకం
  • కోర్టు అనుమతితో ఫోన్ తెరిచేందుకు పోలీసుల ప్రయత్నాలు
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు విచారణలో కీలకమైన పురోగతికి ఒక ఐఫోన్ పాస్‌వర్డ్ అడ్డంకిగా మారింది. గత దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ కేసు ఇప్పుడు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలతో కేసును పునఃప్రారంభించిన పోలీసులు, కీలక సాక్ష్యాధారాలు ఉన్న ఫోన్‌ను తెరవలేక ఇబ్బంది పడుతున్నారు.

వివరాల్లోకి వెళితే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన అనంతబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఆయన ఐఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అత్యంత కీలకమైన ఆ ఫోన్ పాస్‌వర్డ్‌ను మాత్రం అప్పటి దర్యాప్తు అధికారులు తీసుకోలేదు. హత్యకు ముందు, ఆ తర్వాత అనంతబాబు ఎవరెవరితో వాట్సాప్ కాల్స్ మాట్లాడారు?ఫోన్‌లో ఏమైనా వీడియోలు ఉన్నాయా? అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ ఫోన్ డేటా అత్యంత కీలకం. కానీ పాస్‌వర్డ్ లేకపోవడంతో ఆ సమాచారాన్ని రాబట్టడం ప్రస్తుత దర్యాప్తు బృందానికి సవాలుగా మారింది.

గత దర్యాప్తు అధికారుల వైఫల్యంపై ప్రస్తుత అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిక్కుముడిని విప్పేందుకు, కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొంది ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు, దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, ఈ కేసులో భాగంగా తాజాగా అనంతబాబు భార్యకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ (అనంతబాబు) తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి, మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి అర్ధరాత్రి అతడి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసు విచారణ మళ్లీ ఊపందుకుంది. 


More Telugu News