లైంగిక ఆరోపణల దుమారం.. సొంత ఎమ్మెల్యేపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు

  • లైంగిక ఆరోపణల నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ సస్పెన్షన్
  • పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరు నెలల పాటు వేటు వేసిన అధిష్ఠానం  
  • గతవారమే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగింపు
  • ఉప ఎన్నిక భయంతో రాజీనామాకు పట్టుబట్టలేదని ప్రచారం
  • రాజీనామా చేయాలంటూ అధికార, ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి
తీవ్రమైన లైంగిక ఆరోపణల వివాదంలో చిక్కుకున్న కేరళ యువ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్‌పై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు, శాసనసభా పక్ష సమావేశాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది.

కొన్ని రోజుల క్రితం ఈ వివాదం వెలుగులోకి రాగానే, రాహుల్‌ను యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి పార్టీ తొలగించిన విషయం తెలిసిందే. అయితే, ఆరోపణల తీవ్రత దృష్ట్యా ఆయనపై మరింత కఠిన చర్య తీసుకోవాలని ఒత్తిడి పెరగడంతో కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, సీనియర్ నేత రమేశ్‌ చెన్నితాలతో కూడిన నాయకత్వం సుదీర్ఘంగా చర్చించి ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది.

అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాత్రం పార్టీ అధిష్ఠానం కోరలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలక్కాడ్ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే రాజకీయంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందనే ఆలోచనతోనే పార్టీ ఈ ‘డ్యామేజ్ కంట్రోల్’ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. మొదట రాజీనామా చేయించాలని భావించినప్పటికీ, న్యాయనిపుణుల సలహాతో సస్పెన్షన్‌కే పరిమితమైనట్లు సమాచారం.

ఈ వివాదంలో ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ (అవంతిక) చేసిన ఆరోపణలతో పాటు, ఓ మహిళను అబార్షన్ చేయించుకోవాలని, లేదంటే చంపేస్తానని రాహుల్ బెదిరిస్తున్నట్లుగా ఉన్న ఒక ఆడియో క్లిప్ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆడియోలోని గొంతు తనది కాదని రాహుల్ బలంగా ఖండించకపోవడం, దానిపై ఫోరెన్సిక్ విచారణ కోరకపోవడం ఆయనపై అనుమానాలను మరింత పెంచుతోంది. మరోవైపు, మహిళా కమిషన్‌తో పాటు బాలల హక్కుల కమిషన్ కూడా ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించాయి.

రాహుల్ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అధికార సీపీఎం, బీజేపీలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సస్పెన్షన్ చర్యతో వివాదాన్ని చల్లార్చవచ్చని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.


More Telugu News