Sajjala Ramakrishna Reddy: జిల్లాలో మీరే కమాండర్లు: వైసీపీ నేతలకు సజ్జల దిశానిర్దేశం

Sajjala Ramakrishna Reddy Directs YSRCP Leaders in Districts
  • వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులతో సజ్జల సమావేశం
  • పార్టీ పునాదులను బలోపేతం చేయాలని సజ్జల పిలుపు
  • ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం
వైసీపీ పునాదులను క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్ఠం చేయడంపై ఆ పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం. మనోహర్‌ రెడ్డి వంటి పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో పార్టీకి ప్రధాన కార్యదర్శులే కమాండర్ల వంటి వారని అభివర్ణించారు. పార్టీ కల్పించిన ఈ అవకాశాన్ని ఒక సవాలుగా స్వీకరించి, తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలని ఆయన కోరారు. వైసీపీ ఎప్పుడూ ప్రజాపక్షమే అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు.

మండల స్థాయి నుంచి బలమైన నాయకత్వం ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల పక్షాన నిలబడాలని, వారి గొంతుకగా మారి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. మనమంతా ఒక బలమైన వ్యవస్థగా రూపుదిద్దుకోవాలని... ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. 
Sajjala Ramakrishna Reddy
YSRCP
YSR Congress Party
Andhra Pradesh Politics
District Secretaries Meeting
Tadepalli
Lella Appireddy
Pudi Srihari
Public Issues
Political Strategy

More Telugu News