Kamini Konkar: భర్తను కాపాడుకోవడానికి లివర్ దానం.. ఆపరేషన్ తర్వాత భార్యాభర్తల మృతి

Tragedy in Pune Wife Dies of Infection After Donating Liver to Husband
  • మహారాష్ట్రలోని పూణే ఆసుపత్రిలో విషాదం
  • వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ
  • ఆసుపత్రికి నోటీసులు పంపించిన ఆరోగ్య శాఖ అధికారులు
అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన భర్తను కాపాడుకోవడానికి భార్య తన అవయవాన్ని దానం చేసింది. అయితే, ఆపరేషన్ తర్వాత కోలుకుంటాడని అనుకున్న భర్త కన్నుమూశాడు. నాలుగు రోజుల తర్వాత ఇన్ ఫెక్షన్ సోకి భార్య కూడా మరణించింది. ఈ విషాదకర సంఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

పూణే జిల్లాకు చెందిన బాపు కోంకర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఆయన కాలేయం పూర్తిగా దెబ్బతిందని, కాలేయ మార్పిడి చేయాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో బాపు భార్య కామిని తన కాలేయం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పూణేలోని సహ్యాద్రి ఆసుపత్రిలో ఈ నెల 15న కాలేయ మార్పిడి ఆపరేషన్ జరిగింది. కామిని శరీరంలోని కాలేయంలో కొంత భాగాన్ని తీసి ఆమె భర్త బాపు శరీరంలో వైద్యులు అమర్చారు.

ఆపరేషన్ తర్వాత బాపు ఆరోగ్యం మరింత విషమించింది. రెండు రోజుల తర్వాత ఆగస్టు 17న బాపు కన్నుమూశాడు. మరోవైపు, కాలేయ దానం కారణంగా కామినికి ఇన్ ఫెక్షన్ సోకింది. చికిత్స పొందుతూ అదే నెల 21న ఆమె కూడా మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాపు, కామిని చనిపోయారంటూ వారి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ మరణాలపై విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై స్పందించిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు.. కాలేయ మార్పిడి చికిత్సకు సంబంధించిన అన్ని వివరాలు, పేషెంట్ అనారోగ్య వివరాలు, వీడియో ఫుటేజీలతో పాటు రికార్డులన్నీ సమర్పించాలని ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. వాటిని పరిశీలించి వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Kamini Konkar
Bapu Konkar
liver donation
Pune
Maharashtra
organ donation
Sahyadri Hospital
medical negligence
liver transplant
India

More Telugu News