Komatireddy Raj Gopal Reddy: రేవంత్ రెడ్డితో విభేదాలు ఉన్న మాట నిజమే.. కానీ..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Raj Gopal Reddy Clarifies Differences with Revanth Reddy
  • 25 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ అంటూ ప్రచారం
  • ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పిన కోమటిరెడ్డి
  • పార్టీలో చీలిక తెచ్చే ఉద్దేశం లేదని వ్యాఖ్య
తాను 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్యంగా సమావేశమయ్యానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. కొంతమంది ఎమ్మెల్యేలు తనను మామూలుగానే కలిశారని, దానిని ఒక సమావేశంగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వివరణ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, పార్టీలో చీలిక తీసుకువచ్చే ఆలోచన తనకు లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలిగించే పనులు తాను చేయబోనని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి పనితీరుపై రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే కొన్ని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన రహస్య భేటీ నిర్వహించారనే వార్తలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.

మరోవైపు, బీజేపీ నేత ఈటల రాజేందర్‌తో కలిసి రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు కూడా మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో సమావేశం వార్త బయటకు రావడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టయింది. అయితే, రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఈ ప్రచారాన్ని కొట్టిపారేయడంతో ప్రస్తుతానికి ఈ చర్చకు తెరపడినట్లయింది. అయినప్పటికీ, అధికార పార్టీలో ఒక సీనియర్ ఎమ్మెల్యేపై ఇలాంటి వార్తలు రావడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. 
Komatireddy Raj Gopal Reddy
Revanth Reddy
Telangana Congress
Munugodu MLA
Etela Rajender
Congress MLAs meeting
Telangana Politics
BJP
New Party
Internal conflict

More Telugu News