Raghu Rama Krishna Raju: అఖిల భారత స్పీకర్ల సదస్సులో ఏపీ ఉప సభాపతి ఆర్ఆర్ఆర్ కీలక ప్రతిపాదన

Raghu Rama Krishna Raju Proposes Key Resolution at Speakers Conference
  • చట్టసభలు ఏడాదికి కనీసం 60 రోజులైనా సమావేశాలు నిర్వహించాలన్న రఘురామకృష్ణ రాజు 
  • అసెంబ్లీ సగటు దినాలు 35 నుంచి 40 మధ్యకే పరిమితమయ్యాయని ఆవేదన
  • చర్చలకు, సమాలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న ఆర్ఆర్ఆర్
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే చట్టసభలు ఏడాదికి కనీసం 60 రోజులైనా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) అభిప్రాయపడ్డారు. 

నిన్న ఢిల్లీలోని అసెంబ్లీ భవనంలో నిర్వహించిన అఖిల భారత స్పీకర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పార్లమెంటు సగటున 135 రోజులు నడిచేదని అన్నారు. కానీ తాను ఎంపీగా ఉన్న 17వ లోక్‌సభలో సగటు పని దినాలు 55 రోజులు మాత్రమేనని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీల సగటు దినాలు 35 నుంచి 40 మధ్యకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు సమావేశాల మధ్య గరిష్ఠ విరామం 180 రోజులు మించకూడదు అనే రాజ్యాంగ నిబంధనను చాలా రాష్ట్రాలు, మన రాష్ట్రం కూడా, కేవలం ఆ పరిమితిని చేరుకునేలా మాత్రమే పాటిస్తున్నాయని, ఇది సరియైన దిశ కాదని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, ప్రజాస్వామ్యాన్ని ధృడంగా నిలబెట్టాలంటే చట్టసభల పని దినాలు ఏటా కనీసం 60 రోజులకు పెంచాలని ప్రతిపాదిస్తూ ఇందుకోసం మనమంతా ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. ఆర్డినెన్సుల పరిపాలనపై ఆధారపడకుండా, చర్చలకు, సమాలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శాసన వ్యవస్థ బలంగా నిలవాలంటే నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉపసభాపతి స్పష్టం చేశారు.

‘‘స్వాతంత్య్రానికి పూర్వం సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (లోక్ సభ)కి తొలి భారతీయ ప్రెసిడెంట్‌గా పనిచేసిన విఠల్‌భాయ్ పటేల్ వంటి చారిత్రక నాయకుల సేవలను నిజంగా గౌరవించాలంటే, వారిని పొగడటంతో కాకుండా, వారి ఆదర్శాలను అనుసరించి చట్టసభల సజీవతను పరిరక్షించాలి’’ అని రఘురామ సూచించారు. 
Raghu Rama Krishna Raju
RRR
AP Deputy Speaker
Speakers Conference
Legislative Assembly
Parliament Sessions
Indian Democracy
Assembly Meetings
Political News
Vithalbhai Patel

More Telugu News