Dream11: ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్పాన్సర్‌గా వైదొలగిన డ్రీమ్11

What Dream11s Shock Exit As Title Sponsor Means For Indian Cricket Team Ahead of Asia Cup
  • ప్రధాన స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలగిన డ్రీమ్11
  • కేంద్రం తెచ్చిన కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టమే కారణం
  • రూ.358 కోట్ల ఒప్పందం మధ్యలోనే రద్దు
  • కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ తీవ్ర ప్రయత్నాలు
  • స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగే అవకాశం
ఆసియా కప్ 2025 ప్రారంభానికి కొద్ది వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో భారత క్రికెట్ జట్టుకు మైదానం బయట ఊహించని షాక్ తగిలింది. జట్టు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11, తమ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్ర‌క‌టించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025' కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ కొత్త చట్టం ప్రకారం, డబ్బుతో ఆడే ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను నిషేధించడమే డ్రీమ్11 వైదొలగడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఈ అనూహ్య పరిణామంతో బీసీసీఐ అప్రమత్తమైంది. త్వరలోనే జెర్సీ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం కొత్త బిడ్లను ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. అయితే, సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేవలం రెండు వారాల వ్యవధిలో కొత్త స్పాన్సర్‌ను ఖరారు చేయడం బీసీసీఐకి కత్తిమీద సాములా మారింది. భారత జట్టు స్పాన్సర్‌షిప్‌కు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, ఇంత తక్కువ సమయంలో ప్రక్రియను పూర్తి చేయడం సవాలుగా మారింది.

ఒకవేళ టోర్నమెంట్ ప్రారంభమయ్యేలోపు కొత్త స్పాన్సర్ ఖరారు కాకపోతే, ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐ ఆధ్వర్యంలోని భారత జట్టు, జెర్సీపై ప్రధాన స్పాన్సర్ లోగో లేకుండానే బరిలోకి దిగాల్సి వస్తుంది. ఇది చాలా అరుదైన సంఘటన అవుతుంది. ఇప్పటికే డ్రీమ్11 లోగోతో జెర్సీలను ముద్రించినప్పటికీ, వాటిని టోర్నమెంట్‌లో ఉపయోగించబోరని సమాచారం.

గతంలో ఆర్థిక సంక్షోభం కారణంగా బైజూస్, న్యాయపరమైన చిక్కులతో సహారా వంటి సంస్థలు కూడా టీమిండియా స్పాన్సర్‌షిప్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాయి. ఇప్పుడు డ్రీమ్11 కూడా అదే జాబితాలో చేరింది. 2023 జులైలో బీసీసీఐ, డ్రీమ్11 మధ్య మూడేళ్ల కాలానికి గాను రూ.358 కోట్లతో ఒప్పందం కుదిరింది. కానీ, కొత్త చట్టం కారణంగా ఈ ఒప్పందం ఏడాదికే ముగిసిపోతోంది.

ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా స్పందించనప్పటికీ, బోర్డు కార్యదర్శి దేవాజిత్ సైకియా మాట్లాడుతూ, "భారత ప్రభుత్వ చట్టాలను బీసీసీఐ కచ్చితంగా పాటిస్తుంది. చట్టప్రకారం అనుమతి లేని ఏ పనినీ మేము చేయబోము" అని అన్నారు.
Dream11
Asia Cup 2025
Team India
BCCI
Indian Cricket
Sponsorship
Online Gaming Bill 2025
Jersey Sponsor
Devajit Saikia
Cricket

More Telugu News