తమిళంలో వడివేలు స్టార్ కమెడియన్ గా తన కెరియర్ ను సుదీర్ఘకాలం పాటు పరిగెత్తించాడు. ఇక మలయాళంలో ఫహాద్ ఫాజిల్ క్రేజ్ గురించి మనకి తెలియంది కాదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో దర్శకుడు సుధీశ్ శంకర్ ఒక ప్రాజెక్టును సెట్ చేశారు. ఆ సినిమా పేరే 'మారీశన్'. ఆర్.బి. చౌదరి నిర్మించిన ఈ సినిమా, జులై 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. రెండే రెండు ప్రధానమైన పాత్రలతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

కథ: దయాళ్ (ఫహాద్ ఫాజిల్) ఓ చిల్లర దొంగ. తన కంటికి కనిపించిన ఖరీదైన వస్తువులను కాజేయకుండా వదలడు. జైలు నుంచి ఇలా విడుదల కాగానే అలా దొంగతనాలు మొదలుపెడతాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే అతను ఒక ఇంటికి దొంగతనానికి వెళతాడు. ఆ ఇంట్లో అతనికి వేదాచలం (వడివేలు) ఒంటరిగా కనబడతాడు. అతను ఒక గొలుసుతో బంధించబడి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. తాను అల్జీమర్స్ తో బాధపడుతున్నాననీ, అందువలన తాను ఎక్కడికైనా వెళ్లిపోతానని తన కొడుకు కుమార్ తనని బంధించాడని వేదాచలం చెబుతాడు.

తాను ఆ ఇంట్లో నుంచి బయటపడాలని అనుకుంటున్నానీ, తనని విడిపిస్తే పాతిక వేలు ఇస్తానని దయాళ్ తో వేదాచలం చెబుతాడు. దయాళ్ వెంటనే అతనిని విడిపిస్తాడు. దయాళ్ ను 'ఏటీఎమ్' కి తీసుకుని వెళ్లి పాతిక వేలు 'డ్రా' చేసి ఇస్తాడు వేదాచలం. అతని ఎకౌంట్లో ఇంకా పాతిక లక్షలు ఉండటం దయాళ్ చూస్తాడు. ఎలాగైనా ఆ డబ్బు నొక్కేయాలని నిర్ణయించుకుంటాడు. అరుణాచలంలో ఉన్న తన స్నేహితుడి దగ్గరికి తాను వెళుతున్నట్టుగా వేదాచలం చెబుతాడు.తాను అదే రూట్లో వెళుతున్నాననీ, తాను తీసుకువెళతానని అంటాడు దయాళ్. 

అప్పటికే మంత్రిగారి పీఏ తాలూకు బైక్ ను దయాళ్ కాజేస్తాడు. ఆ బైక్ పై వేదాచలాన్ని తీసుకుని బయల్దేరతాడు. ఆ ప్రయాణంలో వేదాచలం తెలుసుకోమన్న అడ్రెస్ లు దయాళ్ తెలుసుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే ఆ అడ్రెస్ కి సంబంధించిన వ్యక్తులు దారుణంగా హత్య చేయబడుతూ ఉంటారు. అసలు వేదాచలం ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? జరుగుతున్న హత్యలకు కారకులు ఎవరు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ పరుగెడుతూ ఉంటుంది. 

విశ్లేషణ: 'మారీశన్' అనే టైటిల్ తో, తమిళ - మలయాళ స్టార్స్ కాంబినేషన్ తో దర్శకుడు ఈ సినిమాపై ఆసక్తిని పెంచగలిగాడు. కథ మొదలవుతూ ఉండగానే,  బోనులో పడిన ఎలుకను ఒకడు బయట వదిలి పెడతాడు. అది ఓ పాడుబడిన ఇంట్లో తలదాచుకున్న విషసర్పం దగరికి వెళుతుంది. కట్ చేస్తే, జైలు నుంచి విడుదలైన దయాళ్, దొంగతనం కోసం వేదాచలం ఉన్న చోటుకి వెళతాడు. ఈ సీన్ తోనే.. ఏదో జరగబోతోందనే కుతూహలాన్ని దర్శకుడు రేకెత్తిస్తాడు. 

అల్జీమర్స్ తో బాధపడుతున్న వ్యక్తి .. అతని ఎకౌంటులో ఉన్న పాతిక లక్షల కోసం  సాయం చేస్తున్నట్టుగా నటించే దొంగ .. ఇద్దరూ కలిసి సాగించే ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎవరు ఎవరిని వాడుకుంటున్నారు? అనే ఒక అయోమయాన్ని క్రియేట్ చేసి, మరింత ఉత్కంఠను రేకెత్తించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ రెండు పాత్రలనే ఎంతసేపు చూడాలి అని ప్రేక్షకులు అనుకునే సమయానికి తెరపైకి కొత్త పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. అక్కడి నుంచి కథ మరింత  ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది.

 పరిస్థితులు వ్యక్తుల స్వభావాలు మార్చేస్తూ ఉంటాయి. కొన్ని సంఘటనలు మంచివాళ్లను కఠినంగా మారుస్తూ ఉంటాయి. మరికొన్ని సంఘటనలు చెడు మార్గంలో వెళ్లే వాళ్లను మంచి మార్గంలోకి మళ్లిస్తూ ఉంటాయి అనే ఒక అంశాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. కథలో నుంచి జారిపోకుండా ప్రేక్షకులు చివరివరకూ పరిగెడుతూనే ఉంటారు. అన్నివర్గాల ప్రేక్షకులు చూడదగిన కంటెంట్ ఇది. 

పనితీరు: కథ .. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. అలాగే ఫహాద్ ఫాజిల్ - వడివేలు నటన ఈ సినిమాకి హైలైట్ అనే అనాలి. సరదాగా సాగిపోతున్న కథను మూలాల్లోకి తీసుకుని వెళ్లి, అక్కడి నుంచి ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంతో ఎక్కువ మార్కులు పడిపోతాయి. 

శివాజీ కెమెరా వర్క్ బాగుంది. అందమైన లొకేషన్స్ ను కవర్ చేస్తూ, కథ ఆహ్లాదంగా పరిగెత్తేలా చూశాడు. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ కూడా నీట్ గా అనిపిస్తుంది. 

ముగింపు: జీవితమనే ప్రయాణంలో ఎక్కడో ఒక చోటున స్వార్థాన్ని వదిలేయాలి .. త్యాగాన్ని భుజానికి ఎత్తుకోవాలి. లేదంటే ఆ జీవితం అసంపూర్ణంగానే మిగిలిపోతుందనే సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది. వినోదంతో కూడిన ఈ సందేశం ఆడియన్స్ కి తప్పకుండా కనెక్ట్ అవుతుంది.