Rahul Dravid: సచిన్ మాట విని తప్పు చేశా.. ఇప్పటికీ బాధపడతా: ద్రవిడ్

Rahul Dravid Reveals Massive Regret After Taking Sachin Tendulkars Advice In 2011
  • సచిన్ సలహా విని డీఆర్ఎస్ తీసుకోకపోవడంపై ద్రవిడ్ విచారం
  • 2011 ఇంగ్లండ్ పర్యటన నాటి ఘటనను గుర్తుచేసుకున్న టీమిండియా మాజీ కోచ్
  • అంపైర్ ఔటిచ్చినా బంతి బ్యాట్‌కు తగలలేదన్న ద్రవిడ్‌
  • పెద్ద శబ్దం వచ్చిందన్న సచిన్.. దాంతో రివ్యూకి వెళ్లని ద్రవిడ్
  • రీప్లేలో బ్యాట్‌కు కాదు, షూలేస్‌కు తగిలినట్లు వెల్లడి
  • అశ్విన్‌తో ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్న ద్రవిడ్
భారత క్రికెట్ చరిత్రలో 'ది వాల్'గా పేరుగాంచిన రాహుల్ ద్రవిడ్, తన కెరీర్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. తాను చేసిన ఒకే ఒక పెద్ద తప్పు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సలహాను పాటించడమేనని, ఆ నిర్ణయం పట్ల ఇప్పటికీ విచారం ఉందని తెలిపాడు. మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ద్రవిడ్ ఈ చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాడు.

అసలేం జరిగిందంటే..?
2011లో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ద్రవిడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక బంతికి అంపైర్ సైమన్ టఫెల్ అతడిని క్యాచ్ ఔట్‌గా ప్రకటించారు. అయితే, బంతి తన బ్యాట్‌కు తగిలినట్లు తనకు అనిపించలేదని ద్రవిడ్ తెలిపాడు. "నేను బంతిని డ్రైవ్ చేసినప్పుడు 'టక్' అని ఒక శబ్దం వచ్చింది. కానీ నా బ్యాట్‌కు బంతి తగిలిన ఫీలింగ్ అస్సలు లేదు. కొన్నిసార్లు బ్యాట్స్‌మెన్‌కు ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది" అని ద్రవిడ్ వివరించాడు.

అంపైర్ నిర్ణయంపై సందేహంతో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సచిన్ వద్దకు వెళ్లి చర్చించాడు. "బంతి నా బ్యాట్‌కు తగలలేదని నేను సచిన్‌తో చెప్పాను. కానీ సచిన్, 'రాహుల్, చాలా పెద్ద శబ్దం వచ్చింది యార్. కచ్చితంగా నువ్వు దాన్ని బాదేశావ్' అని అన్నాడు. అతను అలా చెప్పడంతో బహుశా నాకే పొరపాటుగా అనిపించిందేమో అనుకుని రివ్యూ తీసుకోకుండా పెవిలియన్ వైపు నడిచాను" అని ద్రవిడ్ ఆనాటి సంభాషణను గుర్తుచేసుకున్నాడు.

రీప్లేలో తేలిన నిజం
డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి రీప్లే చూశాక ద్రవిడ్‌కు అసలు విషయం తెలిసింది. బంతి బ్యాట్‌కు కొద్ది దూరంలో వెళ్లిందని, బ్యాట్ అతని షూలేస్‌కు తగలడం వల్ల ఆ శబ్దం వచ్చిందని స్పష్టమైంది. అప్పటికే ఐదుసార్లు 'ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలిచిన సైమన్ టఫెల్ లాంటి గొప్ప అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేయడం కూడా అప్పట్లో అంత తేలిక కాదని ద్రవిడ్ పేర్కొన్నాడు.

కాగా, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో జరిగిన ఆ సిరీస్‌ను భారత్ 4-0 తేడాతో ఘోరంగా ఓడిపోయింది. అయితే, ఆ సిరీస్‌లో ద్రవిడ్ అద్భుతంగా రాణించాడు. నాలుగు టెస్టుల్లో మూడు సెంచరీలతో 461 పరుగులు చేసి భారత జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Rahul Dravid
Sachin Tendulkar
India cricket
James Anderson
2011 England tour
Edgbaston Test
DRS review
Simon Taufel
MS Dhoni
Indian cricket history

More Telugu News