Rinku Singh: ఫ్యాన్ పేజీలో ఫోటో చూసి మనసు పడ్డా.. ఎంపీ ప్రియతో తన ప్రేమకథను వివరించిన రింకూ సింగ్

Rinku Singh Reveals Love Story with MP Priya Saroj
  • సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌తో ప్రేమ, నిశ్చితార్థంపై స్పందించిన రింకూ సింగ్
  • ఆమె తన ఫోటోలు లైక్ చేశాకే ధైర్యం చేసి మెసేజ్ పంపానన్న రింకూ
  • 2022 ఐపీఎల్ నుంచే తమ మధ్య ప్రేమ మొదలైందని వెల్లడి 
  • జూన్ 8న నిశ్చితార్థం జరిగిందని నిర్ధారణ
  • ప్రియ ఎంపీ అయ్యాక మాట్లాడుకోవడానికి సమయం దొరకడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా యువ సంచలనం, ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ తన ప్రేమ, నిశ్చితార్థంపై ఎట్టకేలకు మౌనం వీడాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌తో తన ప్రేమ ప్రయాణం, నిశ్చితార్థానికి దారితీసిన పరిస్థితులను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అనూహ్యంగా వీరి నిశ్చితార్థం వార్త బయటకు రావడంతో ఆశ్చర్యపోయిన అభిమానులకు రింకూ మాటలతో పూర్తి స్పష్టత వచ్చింది.

తమ ప్రేమకథ 2022 ఐపీఎల్ సమయంలో ముంబైలో మొదలైందని రింకూ సింగ్ తెలిపారు. "ఒక ఫ్యాన్ పేజీలో ప్రియ ఫోటోను చూశాను. ఆమె గ్రామంలో ఓటింగ్ కోసం సహాయం కోరుతూ ఆ ఫోటో పెట్టారు. ఆమె సోదరి ఫోటోలు, వీడియోలు తీస్తుంటుంది. ఆ ఫోటో చూడగానే నాకు ప్రియ బాగా నచ్చింది. తనే నాకు సరైన జోడీ అనిపించింది. వెంటనే మెసేజ్ చేద్దామనుకున్నా, కానీ అలా చేయడం సరికాదని ఆగిపోయాను" అని రింకూ ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు.

అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియ తన ఫోటోలను కొన్నింటిని లైక్ చేయడంతో తనకు ధైర్యం వచ్చిందని రింకూ చెప్పాడు. "ఆమె నా ఫోటోలకు లైక్ కొట్టగానే, నేను వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాను. అలా మా సంభాషణ మొదలైంది. వారం, రెండు వారాల్లోనే రోజూ మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మ్యాచ్‌లకు ముందు కూడా మాట్లాడుకునేవాళ్లం. అప్పటి నుంచే మా మధ్య ప్రేమ మొదలైంది" అని వివరించాడు.

ఈ జంటకు జూన్ 8న నిశ్చితార్థం జరిగింది. ప్రియ ఎంపీ అయిన తర్వాత తమ మధ్య ఎలాంటి మార్పులు రాలేదని, కాకపోతే మాట్లాడుకునే సమయం బాగా తగ్గిపోయిందని రింకూ అన్నాడు. "ప్రస్తుతం మేం ఎక్కువగా మాట్లాడుకోలేకపోతున్నాం. ఆమె తన పనుల్లో బిజీగా ఉంటోంది. గ్రామాలకు వెళ్లడం, ప్రజలతో మాట్లాడటం, వారికి సహాయం చేయడం, పార్లమెంట్ సమావేశాలు.. ఇలా ఉదయం వెళ్తే రాత్రికి తిరిగి వస్తుంది. దాంతో రాత్రి పూట మాత్రమే కొద్దిసేపు మాట్లాడుకుంటాం" అని రింకూ సింగ్ తెలిపాడు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ చూస్తేనే ప్రజల కోసం ఎంత కష్టపడుతుందో అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.
Rinku Singh
Priya Saroj
Indian Premier League
IPL
Member of Parliament
Love story
Engagement
Cricket
Samajwadi Party
Uttar Pradesh

More Telugu News