Dhanalakshmi: తిరుపతిలో ఘోరం.. 8 గ్రాముల బంగారం కోసం వృద్ధురాలిని చంపిన కేర్ టేకర్

Caretaker Kills Elderly Woman for 8 Grams Gold In Tirupati
  • పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి కోసం కేర్ టేకర్ ను పెట్టిన టెకీ
  • తండ్రి, మేనత్తలతో పాటు ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నట్లు వెల్లడి
  • శుక్రవారం హైదరాబాద్ లోని ఆఫీసుకు వెళ్లిన సమయంలో కేర్ టేకర్ దారుణం
పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధుడిని చూసుకోవడానికి నియమించిన కేర్ టేకర్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వృద్ధురాలిని చంపి బంగారం ఎత్తుకెళ్లాడు. తిరుపతిలో శుక్రవారం జరిగిందీ ఘోరం. నమ్మకంగా మెలుగుతున్న వ్యక్తి ఇంతటి ఘోరానికి పాల్పడతాడని అనుకోలేదని బాధితురాలి మేనల్లుడు వాపోతున్నాడు. నెలనెలా రూ.22 వేలు చెల్లించినా 8 గ్రాముల బంగారం కోసం మేనత్త ప్రాణం తీశాడని కన్నీటిపర్యంతమయ్యాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ ఆనంద్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రేణిగుంట రోడ్డులోని సీపీఐర్ విల్లాస్ లో తండ్రి షణ్ముగం, మేనత్త ధనలక్ష్మిలతో కలిసి ఉంటున్నాడు. హైదరాబాద్ లోని కంపెనీకి ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. తండ్రి షణ్ముగం ఇటీవల పక్షవాతానికి గురికావడంతో స్థానిక ఏజెన్సీ ద్వారా రవి అనే వ్యక్తిని కేర్ టేకర్ గా పెట్టుకున్నాడు. ఏజెన్సీకి నెలకు రూ.25 వేలు చెల్లిస్తున్నాడు. అయితే, సదరు ఏజెన్సీ ఇందులో కేవలం రూ.15 వేలు మాత్రమే రవికి జీతంగా చెల్లిస్తోంది. దీంతో జీతం సరిపోవడంలేదని రవి మానేశాడు.

రవి నమ్మకంగా పనిచేస్తుండడంతో ఏజెన్సీతో సంబంధం లేకుండా రూ.22 వేలు ఇస్తానని చెప్పి శివ నేరుగా అతనిని నియమించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్ లో మీటింగ్ కు హాజరవ్వాల్సి ఉండడంతో రవికి జాగ్రత్తలు చెప్పి శివ బయలుదేరాడు. ఇదే అదనుగా భావించిన కేర్ టేకర్ రవి.. ఇంట్లో నిద్రపోతున్న ధనలక్ష్మి గొంతు కోసి, ఆమె చెవికి ఉన్న 8 గ్రాముల బంగారు కమ్మలను తీసుకుని పారిపోయాడు. కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేర్ టేకర్ రవి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. శివ ఆనంద్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి రవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Dhanalakshmi
Tirupati murder
care taker Ravi
gold theft
Andhra Pradesh crime
old woman killed
CPI villas
Renigunta road
Shiva Anand
crime news

More Telugu News