బాలీవుడ్ హీరో గోవిందా విడాకుల కేసులో నాటకీయ పరిణామాలు

  • గతేడాది డిసెంబర్‌లోనే కోర్టుకెక్కిన గోవింద భార్య‌ సునీత
  • వ్యభిచారం, క్రూరత్వం వంటి తీవ్ర ఆరోపణలు
  • ప్రస్తుతం కోర్టు పర్యవేక్షణలో కొనసాగుతున్న కౌన్సెలింగ్
  • అంతా సర్దుకుందని, అది ఇక పాత విషయమని గోవిందా లాయర్ వెల్లడి
  • గణేష్ చతుర్థికి అందరూ కలిసే ఉంటారని వ్యాఖ్య
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీతా అహుజా మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఓ వైపు విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగా, మరోవైపు అంతా సర్దుకుందని, సమస్యలేమీ లేవని గోవిందా తరఫు వారు చెప్పడం గందరగోళానికి దారితీస్తోంది. 38 ఏళ్ల వీరి వైవాహిక బంధం ప్రస్తుతం సమస్యల్లో ఉంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, సునీతా అహుజా గతేడాది డిసెంబర్ 5న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 13 (1) కింద.. వ్యభిచారం, క్రూరత్వం, తనను వదిలిపెట్టడం వంటి తీవ్రమైన కారణాలను ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణకు హాజరుకావాలని కోర్టు గోవిందాకు సమన్లు జారీ చేసింది. అయితే, ఆయన వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో ఈ ఏడాది మే నెలలో షోకాజ్ నోటీసు కూడా జారీ చేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత, జూన్ నుంచి కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరికీ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సునీత విచారణకు స్వయంగా హాజరవుతుండగా, గోవిందా కౌన్సెలింగ్ సెషన్లకు హాజరవుతున్నారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు.

ఈ పరిణామాల మధ్య, గోవిందా తరఫు న్యాయవాది లలిత్ బింద్రా స్పందిస్తూ భిన్నమైన వాదన వినిపించారు. "అలాంటి కేసేమీ లేదు, అంతా సర్దుకుంటోంది. పాత విషయాలను ఎవరో మళ్లీ తెరపైకి తెస్తున్నారు. రాబోయే గణేష్ చతుర్థికి మీరందరూ వారిని కలిసి చూస్తారు, మా ఇంటికి రండి" అని ఆయన ఓ జాతీయ మీడియాతో అన్నారు. 

మరోపక్క, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. గత 12 ఏళ్లుగా తన పుట్టినరోజును ఒంటరిగానే జరుపుకుంటున్నానని, గోవిందా తన పనిలో బిజీగా వుండడం వల్ల,  ఎక్కువగా మాట్లాడే ఆయన స్వభావం వల్ల తాము వేర్వేరుగా ఉంటున్నామని సునీత గతంలో చెప్పడం ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. మరోవైపు, గోవిందా ఓ యువ మరాఠీ నటితో సన్నిహితంగా ఉంటున్నారని కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. కోర్టులో కేసు నడుస్తుండగానే, గోవిందా వర్గం నుంచి ఇలాంటి ప్రకటనలు రావడం చర్చనీయాంశంగా మారింది.


More Telugu News