విజయనగరం జిల్లాలో దారుణం .. నవ దంపతుల అనుమానాస్పద మృతి

  • కొత్తవలస మండలం తమ్మన్న మెరక సమీపంలోని కాలనీలో ఘటన
  • మృతులను కొప్పుల చిరంజీవి, గీతల వెంకటలక్ష్మిగా గుర్తింపు
  • కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమ్మన్నమెరక సమీపంలోని ఒక కాలనీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నవ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

మృతులను కొప్పుల చిరంజీవి (30), గీతల వెంకటలక్ష్మి (28)గా పోలీసులు గుర్తించారు. వీరికి వివాహం జరిగి కేవలం 8 నెలలు మాత్రమే అయింది. చిరంజీవి విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వెంకటలక్ష్మి కొత్తవలసలోని ఒక ప్రైవేట్ స్టోర్‌లో పని చేస్తున్నట్లు సమాచారం.

నిన్న రాత్రి ఇంట్లో వారు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికుల హృదయాలను కలచివేసింది. చిరంజీవి ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించగా, అతని భార్య వెంకటలక్ష్మి విగతజీవిగా నేలపై పడి ఉంది.

ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆత్మహత్యా? లేక హత్య జరిగిందా? అనే ప్రశ్నలు స్థానికులను, కుటుంబ సభ్యులను కలవరపెడుతున్నాయి. అయితే బంధువుల కథనం ప్రకారం వారు ఎంతో అన్యోన్యంగా వుండేవారని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 


More Telugu News