నవంబర్‌లో కేరళకు అర్జెంటీనా జట్టు.. మెస్సీ రాకపై వీడని ఉత్కంఠ!

  • భారత్‌కు రానున్న ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు
  • ఈ ఏడాది నవంబర్‌లో కేరళలో ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహణ
  • 2022 ప్రపంచకప్‌ మద్దతుకు కృతజ్ఞతగా పర్యటన
  • అధికారికంగా ధ్రువీకరించిన అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ 
  • మ్యాచ్‌కు స్టార్ ఆటగాడు మెస్సీ వస్తాడా? లేదా? అన్న దానిపై సస్పెన్స్
భారత ఫుట్‌బాల్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు ఈ ఏడాది నవంబర్‌లో భారత్‌లో పర్యటించనుంది. కేరళ వేదికగా ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నట్లు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) శనివారం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ వస్తాడా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

2022 ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు కేరళ నుంచి భారీ స్థాయిలో మద్దతు లభించిన విషయం తెలిసిందే. ఆ అభిమానానికి కృతజ్ఞత తెలిపేందుకే అర్జెంటీనా ఈ పర్యటనకు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ గెలిచిన తర్వాత బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లతో పాటు కేరళ, భారత్‌కు కూడా ఏఎఫ్ఏ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "బంగ్లాదేశ్, కేరళ, ఇండియా, పాకిస్థాన్‌లకు ధన్యవాదాలు. మీ మద్దతు అద్భుతం" అని ఆనాడు పేర్కొంది.

ఏఎఫ్ఏ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, లియోనెల్ స్కాలోని నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు నవంబర్ 10 నుంచి 18 మధ్య రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. వాటిలో ఒకటి అంగోలాలోని లువాండాలో, మరొకటి భారత్‌లోని కేరళలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లలో అర్జెంటీనాతో తలపడే ప్రత్యర్థులెవరనేది ఇంకా ఖరారు కాలేదు.

గతంలో ఈ పర్యటనపై కొంత గందరగోళం నెలకొంది. ఒప్పంద ఉల్లంఘన జరిగిందంటూ ఏఎఫ్ఏ అధికారి ఒకరు ఆరోపణలు చేయగా, కేరళ క్రీడాశాఖ మంత్రి వి. అబ్దురహిమాన్ వాటిని తోసిపుచ్చారు. తాజాగా ఏఎఫ్ఏ అధికారిక ప్రకటనతో అన్ని అనుమానాలకు తెరపడింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. 

ఇదిలా ఉండగా, మెస్సీ ఈ మ్యాచ్‌కు రాకపోయినా, 2025 డిసెంబర్‌లో వ్యక్తిగత పర్యటన కోసం భారత్‌కు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆ పర్యటనలో భాగంగా ఆయన కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించవచ్చని తెలుస్తోంది.


More Telugu News