BJP President: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికలో జాప్యం.. కారణం ఇదే!

BJP President Election Delay Reason Explained
  • కొత్త సారథి ఎంపిక ప్రక్రియలో జాప్యం
  • బీహార్ ఎన్నికలపై దృష్టి సారించిన హైకమాండ్
  • ఉప రాష్ట్రపతి ఎన్నికలు కూడా మరో కారణం
బీజేపీలో నాయకత్వ మార్పునకు రంగం సిద్ధమవుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందే పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను వేగవంతం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొత్త సారథి నేతృత్వంలోనే బీహార్ ఎన్నికలను ఎదుర్కోవాలని పార్టీ భావిస్తున్నా, కొన్ని కీలక కారణాల వల్ల ఈ ఎంపిక ప్రక్రియ ఆలస్యమవుతోంది.

కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం బీజేపీ... దాని భావజాల మార్గదర్శి అయిన ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకత్వం విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరుపుతోంది. పార్టీ మాజీ అధ్యక్షులు, సీనియర్ కేంద్ర మంత్రులు, రాజ్యాంగ పదవులు నిర్వహించిన అనుభవం ఉన్న సుమారు 100 మంది కీలక నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

అధ్యక్షుడి ఎంపిక ఆలస్యమవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నిక దీనిక ఒక కారణం. గత నెలలో జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. సెప్టెంబర్ 9న జరగనున్న ఈ పోలింగ్‌లో తమ అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడంపై పార్టీ ప్రస్తుతం దృష్టి సారించింది.

మరో కారణం, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక వంటి కీలక రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడం. హర్యానా, ఢిల్లీ, జార్ఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం, మొత్తం 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కనీసం 19 చోట్ల అధ్యక్షుల ఎన్నిక పూర్తయ్యాకే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ఇప్పటికే 28 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ముగిసినా, మిగిలిన రాష్ట్రాల్లో పూర్తిచేయడంపై అధిష్ఠానం దృష్టి పెట్టింది.

ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా 2020 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. ఆయన మూడేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత, 2024 లోక్‌సభ ఎన్నికలు, సంస్థాగత పునర్వ్యవస్థీకరణ కారణంగా ఇప్పటికే రెండుసార్లు ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. ఇదిలా ఉండగా, పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు బీజేపీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మండల అధ్యక్ష పదవులకు 40 ఏళ్లలోపు వారికే అవకాశం కల్పిస్తూ యువతకు పెద్దపీట వేస్తోంది. అలాగే, జిల్లా, రాష్ట్ర అధ్యక్షులు కావాలంటే కనీసం పదేళ్లపాటు పార్టీలో క్రియాశీల సభ్యులుగా ఉండాలని నిబంధన విధించింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కీలక పదవులు దక్కుతున్నాయనే అసంతృప్తిని చల్లార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
BJP President
JP Nadda
BJP National President Election
RSS
Bihar Elections
Indian Politics
Jagdeep Dhankhar
CP Radhakrishnan
BJP Organizational Changes
Gujarat BJP

More Telugu News