దేశానికే ఆదర్శంగా ఏపీ 'నైపుణ్యం పోర్టల్': నారా లోకేశ్

  • యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నైపుణ్యం పోర్టల్
  • పరిశ్రమల అవసరాలకు, యువత నైపుణ్యాలకు మధ్య వారధిగా పోర్టల్ ఉండాలన్న లోకేశ్
  • దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ఇంటర్ లో ఎంపీసీ, బైపీసీకి అనుమతించాలని ఆదేశం
రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న 'నైపుణ్యం పోర్టల్'ను దేశానికే ఆదర్శంగా నిలిచేలా రూపొందించాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు, యువత నైపుణ్యాలకు మధ్య వారధిగా ఈ పోర్టల్ పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.

సెప్టెంబర్ నెలలో ఈ పోర్టల్‌ను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని లోకేశ్ సూచించారు. ఈ సందర్భంగా అధికారులు పోర్టల్ పనితీరు, దాని లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మంత్రి పోర్టల్ డెమోను పరిశీలించారు. దేశంలో మరెక్కడా ఇలాంటి సమగ్రమైన పోర్టల్ లేదని ఆయన ప్రశంసించారు. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్‌తో 'నైపుణ్యం పోర్టల్'ను అనుసంధానించాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు.

ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని నైపుణ్య కేంద్రాలు, న్యాక్, సీడాప్‌లను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా ఏటా సుమారు 50 వేల మంది యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు వీలు కలుగుతుందని వివరించారు. ఇప్పటికే 36 రంగాలకు సంబంధించి 3 వేలకు పైగా జాబ్ కేటగిరీలను పోర్టల్‌లో నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు.

ఇదే సమావేశంలో మంత్రి నారా లోకేశ్ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. దృష్టి లోపం ఉన్న విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ వంటి సైన్స్ గ్రూపుల్లో చేరేందుకు అనుమతి మంజూరు చేశారు. వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి, వారి చదువుకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. 


More Telugu News