Dawood Ibrahim: తుపాకులు వదిలి డ్రగ్స్ దందా... ఇండియాలో దావూద్ ఇబ్రహీం కొత్త వ్యాపారం బట్టబయలు

Dawood Ibrahims New Drug Business Exposed in India
  • భోపాల్ శివారులోని జగదీశ్‌పుర గ్రామంలో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుర్తింపు
  • రూ.92 కోట్ల విలువైన మెఫిడ్రోన్ స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు
  • తుపాకుల దందా నుంచి సింథటిక్ డ్రగ్స్ తయారీకి మారిన డి-కంపెనీ
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులోని ఓ మారుమూల గ్రామంలో అండర్ గ్రౌండ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా నడుపుతున్నట్లు భావిస్తున్న భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఛేదించారు. ప్రశాంతంగా కనిపించే జగదీశ్‌పుర గ్రామంలోని ఓ ఇంట్లో రహస్యంగా నిర్వహిస్తున్న ఈ స్థావరంపై ఈ నెల 16న దాడి చేసి, సుమారు రూ. 92 కోట్ల విలువైన సింథటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో అండర్‌వరల్డ్ కార్యకలాపాలు మధ్యప్రదేశ్‌కు ఎంతలా విస్తరించాయో వెలుగులోకి వచ్చింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడిలో 61.20 కిలోల ద్రవరూప మెఫిడ్రోన్ (ఎండి డ్రగ్), దాని తయారీకి ఉపయోగించే 541 కిలోల రసాయనాలను సీజ్ చేశారు. ముంబై, గుజరాత్‌లలో పట్టు బిగించిన పోలీసులు, నిఘా వర్గాల నుంచి తప్పించుకోవడానికి దావూద్ ముఠా తమ కార్యకలాపాలను మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తుపాకులు, బెదిరింపుల నుంచి డి-కంపెనీ ఇప్పుడు అత్యంత లాభదాయకమైన సింథటిక్ డ్రగ్స్ వ్యాపారం వైపు మళ్లిందని నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఈ మొత్తం నెట్‌వర్క్‌ను దావూద్ ఇబ్రహీం ఆయన అనుచరులు సలీం డోలా ఇస్మాయిల్ ఉమైద్ ఉర్ రెహ్మాన్ నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్, దుబాయ్ నుంచి హవాలా మార్గంలో వస్తున్న నిధులతో ఈ దందాను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముంబై, థానే ప్రాంతాల నుంచి రసాయనాలను మినీ ట్రక్కుల్లో భోపాల్‌కు తరలించి, ఇక్కడ డ్రగ్స్‌ను తయారుచేసి దేశవ్యాప్తంగా సరఫరా చేయాలనేది వారి ప్రణాళిక అని వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీని గుజరాత్‌లో శిక్షణ పొందిన ఫైసల్ ఖురేషీ అనే ఫార్మసీ డిప్లొమా హోల్డర్, అతడి సహచరుడు రజాక్ ఖాన్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

ఏడేళ్లుగా ఖాళీగా ఉన్న ఇంటికి, డీఆర్ఐ దాడులకు కేవలం రెండు రోజుల ముందు అంటే ఆగస్టు 14న గంటల వ్యవధిలోనే విద్యుత్ మీటర్ మంజూరు కావడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద డ్రగ్స్ ఫ్యాక్టరీని నడపడం అసాధ్యమని, ఈ కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి సూరత్, ముంబై నగరాల్లో మరో ఐదుగురిని అరెస్టు చేయడంతో ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నట్లు స్పష్టమైంది.
Dawood Ibrahim
Dawood Ibrahim drugs
India drug bust
Bhopal drugs factory
Mephedrone drug
Salim Dola
Underworld drug trade
Drug trafficking India
DRI raid
Synthetic drugs

More Telugu News