ఆ మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలపండి: చంద్రబాబుకు ఎమ్మెల్యే భాను విన్నపం

  • సీఎం చంద్రబాబును కలిసిన నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్
  • నగరి, విజయపురం, నిండ్ర మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చాలని వినతి
  • మరమగ్గ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై సీఎంకు ధన్యవాదాలు
నగరి నియోజకవర్గంలోని నగరి, విజయపురం, నిండ్ర మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. భానుప్రకాశ్ ఇవాళ మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మరమగ్గ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేసినందుకు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సీఎంకు వివరించారు. ముఖ్యంగా, కోసలనగరం పారిశ్రామిక కేంద్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

అదేవిధంగా, గాలేరు-నగరి ప్రాజెక్టులో అంతర్భాగమైన పుత్తూరు వద్ద ఉన్న వేణుగోపాల సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని ఎమ్మెల్యే విన్నవించారు. వీటితో పాటు, ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరుకు సంబంధించిన పలు వినతులను కూడా ఆయన ముఖ్యమంత్రికి అందజేశారు.

తన వినతులపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని గాలి భానుప్రకాశ్ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.



More Telugu News