భగవంతుడిని రాజకీయ ఉచ్చులోకి లాగే ఇలాంటి పార్టీ ఉండడం బాధాకరం: ఆనం రామనారాయణ రెడ్డి

  • జగన్, వైసీపీ నేతలపై ఆనం ఫైర్
  • దేవాలయాలపై విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం 
  • ఆలయాల ప్రతిష్ఠ దెబ్బతీస్తూ జగన్ సైకో ఆనందం పొందుతున్నారని విమర్శలు 
  • ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి రాలేదని వ్యాఖ్యలు
రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని, దేవాలయాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అత్యంత బాధాకరమని, వైసీపీ తమ వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే దేవుడిపై విష ప్రచారం చేస్తోందని ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం ఆధ్యాత్మిక సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీస్తూ వైసీపీ అధినేత జగన్ సైకో ఆనందం పొందుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దేవాలయాల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆనం స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో పాలన ప్రారంభించి, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని ప్రకటించామని గుర్తుచేశారు. అయితే, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఒక పార్టీ, హిందూ మతంపై విశ్వాసం లేని నాయకులు కుట్ర రాజకీయాల్లో భాగంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయడం దారుణమని అన్నారు. తమ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి దిగజారుడు ప్రతిపక్షాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తిరస్కరించి 11 సీట్లకు పరిమితం చేసినా, వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దేవాలయాల ప్రక్షాళనకు నడుం బిగించిందని ఆనం వివరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చామని తెలిపారు. అర్చకుల గౌరవ వేతనాన్ని రూ.10,000 నుంచి రూ.15,000కు పెంచామని, ధూప దీప నైవేద్యాల పథకం కింద 5,211 మంది అర్చకులకు ఇచ్చే మొత్తాన్ని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచేందుకు రూ.66 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. వేద విద్య అభ్యసించిన 599 మంది నిరుద్యోగులకు రూ.3,000 చొప్పున భృతి అందిస్తున్నామని చెప్పారు. దేవాలయాల ఆగమ సంప్రదాయాల్లో ప్రభుత్వ అధికారుల జోక్యం ఉండదని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశామన్నారు. బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు ఆలయ ట్రస్టు బోర్డుల్లో సభ్యత్వం కల్పించేలా చట్టం తీసుకొచ్చామని, నాయీ బ్రాహ్మణులకు కనీసం రూ.25,000 వేతనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

గత వైసీపీ ప్రభుత్వం దేవదాయ శాఖలో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని, కానీ తాము 500కు పైగా ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆనం తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన 377 ఆలయాలను పునరుద్ధరించేందుకు రూ.777 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని, ఇప్పటికే 206 ఆలయాల పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన వాటికి టెండర్లు పిలిచామని వెల్లడించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడని, ఆయనకు టీటీడీ పవిత్రత గురించి మాట్లాడే అర్హతే లేదని అన్నారు. ఆయన హయాంలోనే టీటీడీని రాజకీయ అడ్డాగా మార్చి దోపిడీ చేశారని, లడ్డూ కల్తీ ఎక్కడ మొదలైందో ప్రజలందరికీ తెలుసని ఆరోపించారు. స్వామివారి సొమ్మును సత్రాల పేరుతో దోచుకున్న వ్యక్తి ఇప్పుడు నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్ష హోదా లేకపోవడంతోనే జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోయాడని, వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో సగం మంది సెంట్రల్ జైళ్లలో ఉన్నారని, ఇది ఆ పార్టీ పాపాలకు నిదర్శనమని ఆనం అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్, భూ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, ఈ దుర్మార్గాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్ 'డైవర్షన్ పాలిటిక్స్' ఎంచుకున్నారని ఆనం ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన చూసి ఓర్వలేకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు వైసీపీ కుట్రలను గమనిస్తున్నారని ఆయన అన్నారు.


More Telugu News