తెరపై తగ్గుతున్న హీరోయిన్స్ జోరు!
- ఒకప్పటి సినిమాలలో హీరోయిన్స్ సంఖ్య ఎక్కువ
- అప్పటి సినిమాలలో 6కి తగ్గని పాటలు
- తగ్గిపోతూ వస్తున్న పాటల ప్రాధాన్యత
- క్రైమ్ చుట్టూ తిరుగున్న కథలకి గిరాకీ
- కాన్సెప్ట్ బేస్డ్ కథల్లో కనిపించని హీరోయిన్స్
ఒకప్పుడు ఒక హీరోకి ఇద్దరు హీరోయిన్స్ ఉండేవారు. ఒక్కో సమయంలో ముగ్గురు హీరోయిన్స్ తో హీరోలు రొమాన్స్ చేసిన సినిమాలు లేకపోలేదు. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నప్పటికీ, మాస్ మసాలా సాంగ్ పేరుతో మరో బ్యూటీని రంగంలోకి దింపేవారు. ఎందుకంటే వెండితెరకి గ్లామర్ ఎంతగా అద్దితే అంతగా ఆడియన్స్ ఖుషీ అవుతారు కాబట్టి. కానీ రాన్రాను పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. వెండితెరపై హీరోయిన్స్ సందడి తగ్గుతూ వస్తోంది. పోస్టర్స్ మొదలు .. ఈవెంట్స్ వరకూ హీరోయిన్స్ కనిపించడం తగ్గిపోతూ వస్తోంది. తెరపై వారి పాత్ర నిడివి మాత్రమే కాదు, సినిమా విషయంలో వారి పాత్ర కూడా తక్కువగానే కనిపిస్తోంది. దాంతో ప్రేక్షకులు హీరోయిన్స్ గురించిన ఆలోచనకు దూరమవుతున్నారు. తెరపై హీరోయిన్స్ తమ వైభవాన్ని కోల్పోవడానికి మరో కారణం సాంగ్స్ అనే చెప్పాలి. ఒకప్పుడు సినిమాలో కనీసం ఆరు పాటలు ఉండేవి. కానీ ఆ పాటల సంఖ్య పలచబడుతూ వస్తోంది. ఒకటి రెండు పాటలకే చాలా సినిమాలు పరిమితమవుతున్నాయి. ఇక కొన్ని సినిమాలలో హీరోయిన్స్ ఉండటం లేదు. కథల్లో గ్లామర్ .. రొమాన్స్ టచ్ తగ్గడం, క్రైమ్ పాళ్లు పెరిగిపోవడం ఇందుకు కారణం. మారుతున్న పరిస్థులను గురించి ఆలోచించే సమయం ఎవరికి ఉంది?. ఏదేమైనా కాన్సెప్ట్ బేస్డ్ కంటెంట్ అంటూ హీరోయిన్స్ లేకుండానే చేస్తున్న ప్రయోగాలకు వారి కెరియర్ బలైపోయే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి.