ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎవరికో ప్రకటించిన బొత్స సత్యనారాయణ

  • ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి వైసీపీ మద్దతు
  • ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌కే ఓటు వేస్తామని బొత్స వెల్లడి
  • కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ వైసీపీ అని స్పష్టీకరణ
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాలని తమ పార్టీ నిర్ణయించినట్టు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన చేశారు. బీజేపీ నాయకులు తమను సంప్రదించి మద్దతు కోరారని, దీనికి తమ పార్టీ సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, తమ పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జరిగిందని గుర్తుచేశారు. గతంలో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. కేవలం ఎన్నికల్లోనే కాకుండా, పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక కీలక బిల్లులకు కూడా వైసీపీ మద్దతు తెలిపిందని వివరించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, అనవసరమైన ‘నంబర్ గేమ్’ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి, ఆ తర్వాత ద్రౌపది ముర్ముకు కూడా మద్దతు ఇచ్చిన విషయాన్ని బొత్స గుర్తుచేశారు. అంతేకాకుండా, 2019లో ఆర్టికల్ 370 రద్దు, రైతు చట్టాలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన వంటి అంశాల్లోనూ కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచామని తెలిపారు.


More Telugu News