KCR: నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదు: కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు

KCR Harish Rao Petition Hearing in High Court on Kaleshwaram Project
  • జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్లు
  • కేసీఆర్ తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం
  • జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదన్న కేసీఆర్ తరఫు న్యాయవాది
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని కోర్టుకు తెలిపారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని అన్నారు.

కమిషన్ నివేదికను కేసీఆర్, హరీశ్ రావుకు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు నష్టం చేకూర్చేలా ఈ నివేదికను రూపొందించారని ఆరోపించారు. ఈ నివేదికను వెబ్‌సైట్‌లోనూ అప్‌లోడ్ చేశారని, కేసీఆర్‌కు మాత్రం నివేదిక కాపీలు ఇవ్వలేదని అన్నారు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదని ఆరోపించారు.

కమిషన్ నివేదికపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. కమిషన్ నివేదిక ఆధారంగా 60 పేజీల నివేదికను రూపొందించినట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి నివేదిక వివరాలను తెలిపారని అన్నారు. అసెంబ్లీలో చర్చించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి న్యాయస్థానానికి వివరించారు. ఇద్దరు పిటిషనర్లు కూడా అసెంబ్లీ సభ్యులుగా ఉన్నారని హైకోర్టుకు తెలిపారు. కోర్టుకు సమర్పించిన నివేదిక కాపీలు సరిగ్గా కనిపించడం లేదని, స్పష్టంగా కనిపించేలా ఉన్న కాపీలు సమర్పిస్తే తదుపరి విచారణ చేపడతామని సీజే స్పష్టం చేశారు.
KCR
Kaleshwaram Project
Harish Rao
PC Ghosh Commission
Telangana High Court
BRS Party

More Telugu News