Delhi Murder: ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్.. చిన్న కొడుకే హంతకుడని అనుమానం!

Delhi Triple Murder Mentally Ill Son Suspect
  • మైదాన్‌గఢీలో ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య
  • మృతుల్లో భార్యాభర్తలు, వారి పెద్ద కుమారుడు
  • పరారీలో ఉన్న చిన్న కొడుకు 
  • మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడి
  • దుర్వాసన రావడంతో వెలుగులోకి దారుణం 
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురికాగా, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి చిన్న కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన మైదాన్‌గఢీ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు కథనం ప్రకారం. మైదాన్‌గఢీలోని ఓ ఇంట్లో నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ప్రేమ్ సింగ్ (45-50), ఆయన పెద్ద కుమారుడు హృతిక్ (24) రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. మొదటి అంతస్తులో ప్రేమ్ సింగ్ భార్య రజని (40-45) మృతదేహం లభ్యమైంది. ఆమె నోటికి గుడ్డ కట్టి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఘటన జరిగినప్పటి నుంచి వారి చిన్న కుమారుడు సిద్ధార్థ్ (22-23) కనిపించకుండా పోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన సమాచారం మేరకు సిద్ధార్థ్ గత 12 సంవత్సరాలుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. అతనికి తీవ్రమైన కోపం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) వంటి సమస్యలు ఉన్నట్టు ఇంట్లో లభించిన పత్రాల ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇందుకోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఐహెచ్‌బీఏఎస్)లో చికిత్స పొందుతున్నట్టు ప్రిస్క్రిప్షన్స్ ను బట్టి తెలుస్తోంది.   

కత్తులతో పొడిచి, ఇటుకలు, రాళ్లతో కొట్టి ముగ్గురినీ సిద్ధార్థ్ అత్యంత కిరాతకంగా చంపి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అంతేకాకుండా "తన కుటుంబాన్ని తానే చంపేశానని, ఇకపై ఆ ఇంట్లో ఉండనని" సిద్ధార్థ్ ఎవరితోనో చెప్పినట్టు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. మృతుడైన ప్రేమ్ సింగ్‌కు మద్యం సేవించే అలవాటు ఉందని, ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని గ్రామ ప్రధాన్ మహమ్మద్ షకీల్ అహ్మద్ ఖాన్ తెలిపారు.

ప్రస్తుతం పోలీసులు ఇంటిని సీల్ చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరిస్తున్నాయి. పరారీలో ఉన్న నిందితుడు సిద్ధార్థ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Delhi Murder
Prem Singh
Delhi Crime
Triple Murder
Siddharth
Maidangarhi
OCD
Institute of Human Behaviour and Allied Sciences
Crime News India
Delhi Police

More Telugu News