Chen Hong: ఐదేళ్ల జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు నాలుగేళ్లలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ!

Chen Hong Woman Avoids Jail with Multiple Pregnancies
  • మోసం కేసులో చైనా మహిళకు జైలు శిక్ష  
  • చట్టంలోని లొసుగును అడ్డం పెట్టుకుని అధికారుల కళ్లుగప్పిన వైనం
  • చివరకు పట్టుకుని నిర్బంధ కేంద్రానికి తరలించిన అధికారులు
  • గతంలోనూ ఇలాగే మరో మహిళ 14 సార్లు గర్భవతినని నాటకం
జైలు శిక్ష నుంచి తప్పించుకోవడానికి నేరస్థులు రకరకాల ఎత్తులు వేస్తుంటారు. కొందరు అనారోగ్యం నటిస్తే, మరికొందరు మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతారు. కానీ, చైనాలో ఓ మహిళ వేసిన ప్లాన్ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మోసం కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడగా, దాని నుంచి తప్పించుకోవడానికి ఏకంగా నాలుగేళ్ల వ్యవధిలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి అధికారులనే నివ్వెరపరిచింది.

చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌కు చెందిన చెన్ హాంగ్ అనే మహిళ ఓ మోసం కేసులో దోషిగా తేలింది. దీంతో కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, చైనా చట్టాల ప్రకారం గర్భిణులు లేదా పాలిచ్చే తల్లులు జైలు బయట ఉంటూనే స్థానిక అధికారుల పర్యవేక్షణలో శిక్ష అనుభవించవచ్చు. ఇదే నిబంధనను చెన్ హాంగ్ తనకు అనుకూలంగా మార్చుకుంది. శిక్ష ఖరారైన నాటి నుంచి పదేపదే గర్భం దాల్చుతూ జైలుకు వెళ్లకుండా తప్పించుకుంది. ఈ క్రమంలో నాలుగేళ్లలో ఒకే వ్యక్తి ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.

ఇటీవల మే నెలలో అధికారులు జరిపిన తనిఖీల్లో ఆమె అసలు ప్లాన్ బయటపడింది. ఆమె మూడో బిడ్డను తన వదిన పేరు మీద నమోదు చేసినట్టు అధికారులు గుర్తించారు. విచారణలో తాను విడాకులు తీసుకున్నానని, మొదటి ఇద్దరు పిల్లలు మాజీ భర్త వద్ద ఉంటున్నారని, మూడో బిడ్డను తన మాజీ భర్త సోదరికి ఇచ్చేశానని ఆమె అంగీకరించింది. దీంతో ఆమె కావాలనే గర్భం దాల్చి శిక్షను ఎగ్గొడుతోందని నిర్ధారించుకున్న అధికారులు, ఆమెను వెంటనే జైలుకు పంపాలని నిర్ణయించారు.

చెన్ హాంగ్ శిక్షాకాలం మరో ఏడాదిలోపే మిగిలి ఉండటంతో అధికారులు ఆమెను జైలుకు బదులుగా ఒక నిర్బంధ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన చైనా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చట్టంలోని లొసుగులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "కేవలం జైలు నుంచి తప్పించుకోవడానికే పుట్టిన ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి చూస్తే జాలేస్తోంది" అని ఒకరు వ్యాఖ్యానించారు.

చైనాలో ఇలాంటి ఘటన జరగడం ఇది మొదటిసారి కాదు. 2005లో అవినీతి కేసులో జీవిత ఖైదు పడిన జెంగ్ అనే మరో మహిళ, పదేళ్లలో 14 సార్లు గర్భవతినని చెప్పి జైలుకు వెళ్లకుండా తప్పించుకుంది. చివరకు ఆమె కూడా తన శిక్షను అనుభవించాల్సి వచ్చింది.
Chen Hong
China
jail sentence
fraud case
pregnant
prison escape
Chinese law
Shansi province
social media

More Telugu News