Chandrababu Naidu: నీటికుంటలో పడి ఆరుగురు చిన్నారుల మృతి... సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Chandrababu Naidu reacts to 6 children drowning in Kurnool
  • కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలిలో తీవ్ర విషాదం
  • పాఠశాల సమీపంలోని నీటి కుంట లో పడి ఆరుగురు చిన్నారుల మృతి
  • మృతులంతా ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తింపు
  • ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కుంట లో పడిపోయిన చిన్నారులు
  • ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన 
  • బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లిన ఆరుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, చిగిలి గ్రామంలోని పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ అనే ఆరుగురు విద్యార్థులు పాఠశాల సమీపంలో ఆడుకునేందుకు వెళ్లారు. అక్కడ ఉన్న ఓ నీటి కుంట వద్దకు చేరుకున్న చిన్నారులు, అదుపుతప్పి ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి ఆరుగురూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది: సీఎం చంద్రబాబు

ఈ దురదృష్టకర సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరుగురు చిన్నారులు ఒకేసారి మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన చెందారు. "ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారులు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబాలకు తీరని లోటు. వారికి కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన అత్యంత బాధాకరం" అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ముఖ్యమంత్రి, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
Chandrababu Naidu
Kurnool district
Andhra Pradesh
Children drowned
Water pond accident
Chigili village
Student deaths
Tragic incident
Accidental deaths
Grief

More Telugu News