హైదరాబాదులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్... ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు అల్టిమేటం

  • అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్
  • ఎన్టీఆర్, ఆయన తల్లి శాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తీవ్ర ఆరోపణ
  • అభిమానికి ఫోన్ చేసి సినిమా ఆపేస్తానని బెదిరించారని తీవ్ర ఆగ్రహం
  • ప్రసాద్‌ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ అధిష్టానానికి విజ్ఞప్తి
  • రెండు రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిక
  • రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ప్రకటన
టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్‌పైనా, ఆయన మాతృమూర్తి శాలినిపైనా అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమాన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే ప్రసాద్ బేషరతుగా, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఆయన్ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అభిమానులు బుధవారం నాడు హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించారు. తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. రెండు రోజుల్లో తమ డిమాండ్లు నెరవేరకపోతే, అనంతపురంలోని ఆయన ఇంటిని ముట్టడిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

అసలు ఏం జరిగిందంటే?

ఓ అభిమానికి అర్ధరాత్రి దాటాక తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎమ్మెల్యే ప్రసాద్ ఫోన్ చేసి, ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటానని, థియేటర్లో రీల్ తగలబెడతానని బెదిరించినట్లు అభిమానులు ఆరోపించారు. ఈ సంభాషణలో జూనియర్ ఎన్టీఆర్‌ను, మాతృమూర్తి అయిన ఆయన తల్లిని కించపరిచేలా అత్యంత జుగుప్సాకరమైన భాష వాడారని వారు మండిపడ్డారు. "ఒక తల్లిని పట్టుకుని, సభ్యసమాజం తలదించుకునేలాంటి మాటలు మాట్లాడటానికి ఆయనకు సిగ్గులేదా? రాజకీయ నాయకుడు సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి కానీ, ఇలా అభిమానులను బెదిరిస్తూ అసాంఘిక శక్తులను ప్రోత్సహించడమేంటి?" అని పలు జిల్లాల నుంచి వచ్చిన అభిమాన సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. కర్ణాటక, తూర్పు గోదావరి, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన అభిమానులు ఈ సమావేశంలో తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే...!

దగ్గుబాటి ప్రసాద్ కేవలం క్షమాపణ చెబితే సరిపోదని, తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేశారు. "విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో, ఆయన జెండా నీడన గెలిచిన ఒక ఎమ్మెల్యే అయి ఉండి, అదే కుటుంబంపై, ఆ ఇంటి కోడలిపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పే టీడీపీలో ఇలాంటి నాయకులు ఉండటం పార్టీకే అవమానం. గతంలోనూ కొందరు నాయకులు నందమూరి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినా మేం సహనంతో ఉన్నాం. కానీ ఇకపై మా ఓపిక నశించింది. దీనికి ఒక ముగింపు పలకాలి. పార్టీ అధిష్ఠానం వెంటనే స్పందించి ప్రసాద్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. అలా చేస్తేనే భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి దుస్సాహసానికి పాల్పడరు" అని అభిమానులు టీడీపీ అధినేత చంద్రబాబుకు, హోంమంత్రి అనితకు విజ్ఞప్తి చేశారు.

రెండు రోజుల డెడ్‌లైన్... ఆ తర్వాత మా ప్రణాళిక మాకుంది...!

ఎమ్మెల్యే ప్రసాద్‌కు అభిమానులు రెండు రోజుల గడువు విధించారు. "ఆయన ఎవరినైతే ఫోన్‌లో బెదిరించారో, ఆ అభిమానిని పక్కన కూర్చోబెట్టుకుని, మీడియా సమక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అలా చేయని పక్షంలో, ఆయన మాట్లాడిన మాటలను డీజేల రూపంలో అనంతపురం వీధుల్లోనే కాదు, రాష్ట్రమంతా వినిపిస్తాం. ఆయన ఇంటిని ముట్టడించడం ఖాయం. మా హీరో ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండాలని, ఎవరినీ నొప్పించవద్దని మాకు నేర్పించారు. అందుకే ఇన్నాళ్లూ ఓపిక పట్టాం. 25 ఏళ్లుగా ఎన్నో అవమానాలు చూశాం. ఇక ఆగేది లేదు. ఎన్టీఆర్ అభిమానుల సత్తా ఏంటో చూపిస్తాం" అని హెచ్చరించారు.

రాజకీయాలు, సినిమా వేరు!

రాజకీయాలను, సినిమా రంగాన్ని కలపడం సరికాదని అభిమానులు హితవు పలికారు. "మా హీరో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. 25 ఏళ్లుగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని, ఆస్కార్ స్థాయికి ఎదిగి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. అలాంటి వ్యక్తిపై, ఆయన కుటుంబంపై అనవసరంగా బురద చల్లాలని చూడటం నీచమైన చర్య. ప్రభుత్వం సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చిన తర్వాత, మధ్యలో ఈ ఎమ్మెల్యే పెత్తనం ఏంటి? ఆయన పర్మిషన్ మాకెందుకు? ఇది పూర్తిగా వ్యక్తిగత కక్ష సాధింపు చర్యే" అని వారు ఆరోపించారు. మొత్తం మీద, ఈ వివాదం ఇప్పుడు రాజకీయంగానూ వేడి పుట్టిస్తోంది. పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.


More Telugu News