KTR: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తామంటే.. స్పష్టం చేసిన కేటీఆర్

KTR Clarifies BRS Stance on Vice President Election
  • 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకువచ్చేవారికి మద్దతు అన్న కేటీఆర్
  • తెలంగాణలో రెండు నెలలుగా దయనీయ పరిస్థితి ఉందని ఆందోళన
  • పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదన్న కేటీఆర్
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతు ఇస్తామో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 9 లోపు ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకువస్తారో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన తేల్చి చెప్పారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో రెండు నెలలుగా దయనీయమైన పరిస్థితి నెలకొందని కేటీఆర్ అన్నారు. యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురిచిందని విమర్శించారు.

ఎరువుల బస్తాల కోసం రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి రాలేదని గుర్తు చేశారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి సమీక్ష చేయలేదని అన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.

బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖతో ఇతర శాఖలకు సమన్వయం లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాకం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

ఒక రైతు 3 బస్తాల యూరియా తీసుకుంటే నాన్-బెయిలబుల్ కేసు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెట్‌లో యూరియా విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీకి 51 సార్లు వెళ్లిన రేవంత్ రెడ్డి ఒక్క బస్తా యూరియా కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు.
KTR
K Taraka Rama Rao
BRS
Telangana
Vice President Election
Fertilizer Shortage
Revanth Reddy

More Telugu News